Friday, May 21, 2010

9 అంశాల్లో సవరణ

డీటీసీ ప్రతిపాదనలపై ప్రభుత్వ హామీ
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల స్మృతి(డీటీసీ) ముసాయిదాలో 9 అంశాల్లో సవరణలు చేయాల్సి ఉందని గుర్తించామని ప్రభుత్వం వెల్లడించింది. పునఃముద్రణలో వీటిని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. సరిదిద్దిన ప్రతిపాదిత పత్రాన్ని ప్రజాభిప్రాయం కోసం త్వరలోనే అందుబాటులో ఉంచుతామని తెలిపింది. వారి అభిప్రాయాలు సేకరించాక, పార్లమెంటు ఆమోదం కోసం వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల సలహా సంఘానికి మంత్రి ఈ వివరాలు తెలిపినట్లు అధికార ప్రకటనలో వివరించారు. ఈ ఏడాది మరో 2 కేంద్రీయ విశ్లేషణ కేంద్రాలను (సీపీసీ) నెలకొల్పుత్నుట్లు ప్రణబ్‌ తెలిపారు. పన్ను రిటర్న్‌లను త్వరగా చెల్లించడం, రికార్డుల నిర్వహణను మెరుగు పరచేందుకు ఇది ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదార్లకు రిఫండ్‌లను త్వరగా చెల్లించేందుకు ప్రస్తుతం 15 నగరాల్లో అమలవుతున్న రిఫండ్‌ బ్యాంకర్‌ పథకాన్ని మరికొన్ని నగరాలకు విస్తరిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ విధానంలో భారతీయ స్టేట్‌బ్యాంకుకు పన్ను రిఫండ్‌లను బదిలీ చేస్తారు. అక్కడనుంచి చెల్లింపుదార్ల ఖాతాలకే నేరుగా నగదు చేరుతుంది.

తొలి ముసాయిదా ప్రకారం..: డీటీసీపై తొలి చర్చాపత్రాన్ని ఆర్థికశాఖ గత ఏడాది ప్రజల ముందుకు తెచ్చింది. ఈ ప్రకారం వార్షికాదాయం రూ.25 లక్షలు దాటితేనే 30% పన్ను విధిస్తారు. ప్రస్తుతం ఈ శ్లాబ్‌ రూ.8 లక్షల పైనే ఉంది. మిగతా శ్లాబ్‌ల్లోనూ ఇటువంటి మార్పులే ఉన్నాయి. దీంతోపాటు దీర్ఘకాల పొదుపు పథకాల నుంచి సొమ్ము వాపసు తీసుకునేప్పుడు పన్ను విధించాలని, కంపెనీల ఆస్తులపై కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్‌) విధించాలనే ప్రతిపాదనలు ఈ ముసాయిదాలో ఉన్నాయి. వీటిపై ప్రజలు, పరిశ్రమ వర్గాల నుంచి తీవ్ర స్పందన వచ్చింది.

పారదర్శక విధానాల కోసం..: పారదర్శక పద్ధతులను తెలపాలంటూ 65 దేశాలకు ప్రభుత్వం లేఖలు రాసింది. చర్చలు, పన్ను సమాచార మార్పిడి ఒప్పందం కోసం పన్ను లేని, తక్కువగా ఉన్న 20 దేశాలను గుర్తించినట్లు ప్రభుత్వం పేర్కొంది. స్విస్‌ బ్యాంకు ఖాతాల్లో భారతీయులకు చెందిన వేల కోట్ల రూపాయలున్నాయని గత ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఆరోపణలు గుప్పించడంతో పారదర్శకత అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

జులై 24న ఆదాయపు పన్ను దినోత్సవం: తొలి ఆదాయపు పన్ను చట్టం 1860, రూపొందించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జులై 24న 'ఇన్‌కంట్యాక్స్‌ డే'గా ఆదాయపుపన్ను శాఖ ఉత్సవాలు జరపనుంది. ప్రథమ ఆర్థిక శాఖ సభ్యుడైన జేమ్స్‌ విల్సన్‌ 1860లో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను చట్టాన్ని, అదే ఏడాది జులై 24న నాటి గవర్నర్‌ జనరల్‌ ఆమోదించడంతో వెంటనే అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం (1961) స్థానంలో వచ్చే ఏడాది ప్రత్యక్ష పన్నుల చట్టం ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్భంగా శాఖ తరఫున పలు కార్యక్రమాలు ప్రారంభించి, పూర్తిచేస్తామని సీబీడీడీ సభ్యుడు (రెవెన్యూ) దుర్గేశ్‌ శంకర్‌ పీటీఐతో చెప్పారు. పన్ను చెల్లింపు, రిఫండ్‌కు సంబంధించి ఈ ఏడాదే కొన్ని సేవలు ప్రవేశ పెట్టాలని ఆదాయపు పన్ను శాఖ ప్రణాళికలు రూపొందించింది. టీడీఎస్‌ డైరెక్టరేట్‌ను ప్రారంభించడంతో పాటు పన్ను చెల్లింపులు, రిఫండ్‌ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయనున్నారు. ప్రత్యక్ష పన్నుల్లో టీడీఎస్‌ వాటా 40% ఉందని దుర్గేశ్‌ తెలిపారు.