Saturday, May 8, 2010

7,500 కోట్లు వచ్చె.. 9,000 కోట్లు పోయె

ముంబయి: అంబానీ సోదరుల కంపెనీల మార్కెట్‌ విలువపై కూడా తీర్పు ప్రభావం కనిపించింది. ఓ పక్క ముకేశ్‌కు చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ శుక్రవారం ఒక్కరోజే రూ.7,500 కోట్ల మేర మార్కెట్‌ విలువను పెంచుకుంటే; మరో పక్క అడాగ్‌ సంస్థల మార్కెట్‌ విలువ రూ.9,000 కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ధర రూ.1,033.85 వద్ద ముగియడంతో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.3,30,580.30 కోట్ల నుంచి రూ.3,38,085 కోట్లకు చేరింది. రిలయన్స్‌ పవర్‌ రూ.3,307 కోట్లు; ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ రూ.2,547 కోట్లు పోగొట్టుకున్నాయి. రిలయన్స్‌ పవర్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.36,886.75 కోట్ల నుంచి రూ.33,579 కోట్లకు పరిమితం కాగా.. 23 శాతం పైగా షేరు ధర నష్టపోయిన ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ మార్కెట్‌ విలువ రూ.11,162 కోట్ల నుంచి రూ8,614.76 కోట్లకు దిగజారింది. ఇంకా రిలయన్స్‌ ఇన్‌ఫ్రా(రూ.1,660 కోట్లు); ఆర్‌కామ్‌(రూ.867.5 కోట్లు); రిలయన్స్‌ క్యాపిటల్‌(రూ.637 కోట్లు); రిలయన్స్‌ మీడియావర్క్స్‌(రూ.60 కోట్లు) కూడా గణనీయంగానే తమ మార్కెట్‌క్యాప్‌లను కోల్పోయాయి.