Saturday, May 8, 2010

కేజీ గ్యాస్‌పై సర్కారుదే తుదిమాట

స్పష్టం చేసిన సుప్రీం

అనిల్ చౌక గ్యాస్‌కు చుక్కెదురు
ముకేష్ అంబానీ విజయహాసం
ఆరు వారాల్లోగా మళ్లీ చర్చలు
అంబానీ సోదరులకు కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ : సహజవాయువు వినియోగం, విక్రయ ధరపై నిర్ణయాధికారం పూర్తిగా ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కృష్ణాగోదావరి బేసిన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉత్పత్తి చేస్తున్న సహజవాయువును అయిదేళ్ల క్రితం కుదిరిన అంబానీల కుటుంబ ఒప్పందం మేరకు చౌకరేట్లకు తమకు సప్లయ్ చేయాలని అనిల్ ధీరూభాయ్ గ్రూప్ సంస్థ ఆర్ఎన్ఆర్ఎల్ చేసిన వాదనను న్యాయస్థానం తిరస్కరించింది.

సహజవాయువు ధర విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయాధికారం అనీ, ప్రభుత్వానికి కేజీ బేసిన్ కాంట్రాక్టు సంస్థ రిలయన్స్‌కు మధ్య కుదిరిన ఉత్పత్తి పంపక ఒప్పందం (పిఎస్‌సి) కేజీ గ్యాస్‌కు సంబంధించిన అన్ని ఇతర ఒప్పందాలను అధిగమిస్తుందని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును ముకేష్ అంబానీ గ్రూప్ విజయంగా భావిస్తున్నారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెజి బాలకృష్ణన్, జస్టిస్ సదాశివం, జస్టిస్ సుదర్శన్‌రెడ్డితో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం నాడు ఈ కేసులో తీర్పును వెలువరించింది. జస్టిస్ బాలకృష్ణన్ ఈ నెల 11న పదవీ విరమణ చేస్తున్నారు.

ప్రభుత్వ విధానాలకు లోబడి గ్యాస్ సప్లయ్‌కు సంబంధించి అనిల్ ధీరూభాయ్ అంబానీ సంస్థ ఆర్ఎన్ఆర్ఎల్‌తో మళ్లీ చర్చలు జరపాలని ముకేష్ అంబానీ గ్రూప్ సంస్థ ఆర్ఐఎల్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

ఆర్ఎన్ఆర్ఎల్ వాటాదారుల ప్రయోజనలను కూడా దృష్టిలో ఉంచుకుని ఆరు వారాల్లోగా చర్చలు పూర్తి చేసి ఎనిమిదివారాల్లోగా బొంబాయి హైకోర్టుకు నివేదిక సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఇరువర్గాలను ఆదేశించింది. జస్టిస్ బాలకృష్ణన్, జస్టిస్ సదాశివం తరఫున మెజార్టీ తీర్పును జస్టిస్ సదాశివం చదవగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి విడిగా తమ తీర్పును వెలువరించారు.

జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ కేసు విచారణలో జస్టిస్ పి.రవీంద్రన్ స్థానంలో వచ్చారు. తన దగ్గర రిలయన్స్ సంస్థల షేర్లు ఉన్న నేపథ్యంలో రవీంద్రన్ కేసు నుంచి తప్పుకున్న విషయం విదితమే.

అంబానీసోదరుల మధ్య కుదిరిన ఒప్పందం పూర్తిగా ప్రైవేట్ వ్యవహారమనీ దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభిప్రాయపడగా, సోదరుల మధ్య వ్యాపార విభజనకు కుటుంబ ఒప్పందమే ప్రాతిపదికగా ఉన్నందున గ్యాస్ పంపిణీకి సంబంధించిన పునర్ చర్చలకు కూడా కుటుంబ ఒప్పందం ప్రాతిపదికగా ఉండవచ్చని జస్టిస్ బాలకృష్ణన్, జస్టిస్ సదాశివం అభిప్రాయపడ్డారు.

కేజీ గ్యాస్ పంపకానికి వాటాలేసుకుంటూ అంబానీసోదరులు రాసుకున్న పంపకం పత్రాలకు సాంకేతికంగా గానీ చట్టప్రకారంగానీ చెల్లుబాటు లేదని కోర్టు స్పష్టం చేసింది. కుటుంబ ఒప్పందాన్ని అన్నదమ్ములు బహిర్గత పర్చనందున అది కార్పొరేట్ పరిధిలోకి రాదని కూడా న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్‌కు చెందిన 30 లక్షల మంది షేర్ హోల్డర్లకు ఒప్పందంలోని వివరాలు తెలియవని ఈ ఒప్పందం ఇద్దరు సోదరులు వారి తల్లికి మధ్య కుదిరిందని అన్నారు.

కుటుంబ ఒప్పందం ఆధారంగా రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యం విభజన స్కీమ్‌కు ఆమోదం తెలిపింది బొంబాయి హైకోర్టు కావడంతో, గ్యాస్ సప్లయ్ కోసం కుదుర్చుకునే కొత్త ఒప్పందాన్ని కూడా ఆర్ఐఎల్- ఆర్ఎన్ఆర్ఎల్ బొంబాయి హైకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.