
అపశ్రుతులు: ఈ ఏడాది జేఈఈ నిర్వహణలో అనూహ్యంగా తప్పులు జరిగాయి. సూచనలపరంగా, ఒ.ఎం.ఆర్. షీట్ల పరంగా కూడా పొరపాట్లు చోటుచేసుకున్నాయి. గణిత ప్రశ్నపత్రం కఠినంగా, నిడివి ఎక్కువగా ఉంది. దాదాపు 50శాతం మార్కులకు నెగిటివ్ మార్కులు లేవు. దీంతో ప్రతిభ లేనివారు కూడా అదృష్టం ఉంటే ర్యాంకర్లయ్యే అవకాశాలు పెరిగాయి. ఏఐఈఈఈయే దీనికంటే కఠినంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సీట్ల సంఖ్య వరకూ చూస్తే- బాంబే (3145 సీట్లు), చెన్నై (2619 సీట్లు), ఢిల్లీ (2264 సీట్లు) జోన్‌ల పరిధిలోని విద్యార్థులు కిందటి సంవత్సరం మాదిరే ఈ ఏడాది కూడా తమ ఆధిక్యం ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు భాగంగా ఉన్న చెన్నై జోన్ విద్యార్థులు కిందటి ఏడాది (2426 సీట్లు)తో పోలిస్తే ఈ ఏడాది 193 సీట్లు అదనంగా సాధించారు.
పరీక్షావిధానంలో కీలక మార్పు: 2006లో ఐఐటీ-జేఈఈ పరీక్షా విధానంలో కీలకమైన మార్పు జరిగింది. 1982 వరకూ పూర్తిస్థాయి నాన్ ఆబ్జెక్టివ్ పరీక్షగా ఉన్న జేఈఈ తర్వాత ఎన్నో విధాలుగా మారుతూ వచ్చింది. కొంతకాలం 20 శాతం ఆబ్జెక్టివ్ + 80 శాతం నాన్ ఆబ్జెక్టివ్ టైపు పరీక్షగా, తర్వాత రెండంచెల్లో స్క్రీనింగ్ + మెయిన్స్ పరీక్షగా ఉండేది. 2006 నుంచీ పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలోకి మారింది. వేగానికి కూడా ప్రాధాన్యం పెరిగింది. దీనితో సాంప్రదాయిక శిక్షణలో మార్పులు అవసరమయ్యాయి. దాదాపు ఇదే సమయంలో కార్పొరేట్ విద్యాసంస్థలు ఐఐటీ-జేఈఈ శిక్షణలో ప్రవేశించాయి. 150కు మించి ర్యాంకులు రాకపోయే పరిస్థితి నుంచి మన రాష్ట్రానికి 1,500- 2,000 ర్యాంకులు రావటం మొదలైంది!
ర్యాంకుల సంఖ్య పెరగటానికి మరికొన్ని కారణాలు తోడయ్యాయి.
*ఐఐటీలపై విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో అవగాహన పెరుగుతూ వచ్చింది. గత ఏడాది కంటే ఈ ఏడాది 18.3 శాతం మంది విద్యార్థులు అదనంగా రాశారు.
*కొత్త ఐఐటీలు రావటం, మొత్తం సీట్ల సంఖ్య పెరగటం మరో హేతువు. 2007 వరకూ దేశంలో ఏడు ఐఐటీలే ఉండేవి. 2008లో ఆరు ఐఐటీలూ (హైదరాబాద్ ఐఐటీతో కలిపి), 2009లో రెండు ఐఐటీలూ కొత్తగా వచ్చాయి.
*మరో ముఖ్యమైన అంశం- మన రాష్ట్ర సిలబస్‌కూ, సీబీఎస్‌ఈ సిలబస్‌కూ అంతరం బాగా తగ్గటం.

జేఈఈలో 3 గంటల వ్యవధి చొప్పున ఉండే 2 పేపర్లుంటాయి. రసాయన, భౌతిక శాస్త్రాల్లో, గణితంలో ప్రశ్నలుంటాయి. మొదటి పేపర్‌కూ, రెండో పేపర్‌కూ మధ్య రెండు గంటల వ్యవధి ఇస్తారు. పరీక్షావిధానంలో ప్రధానమైన మార్పు వచ్చిన దగ్గర్నుంచీ ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్న విద్యార్థులను గమనిస్తే... ప్రతిభ ఉన్నవారి కంటే ప్రణాళికాబద్ధంగా చదివినవారినే విజయం వరిస్తోందని స్పష్టమౌతోంది. ఐఐటీ-జేఈఈపై మన విద్యార్థుల్లో ఇంకా అపోహలున్నాయి. ఇది క్లిష్టమైన పరీక్ష అనే భయం తొలగించుకోగలిగితే ఈ విజయం కచ్చితంగా 40 శాతం నుంచి 50 శాతంగా మారుతుందని విద్యావేత్తల అభిప్రాయం!