న్యూఢిల్లీ: మొత్తం ఆస్తుల విలువ ప్రకారం దేశంలో తమదే రెండో అతి పెద్ద బ్యాంకని ప్రైవేటురంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. ప్రస్తుతం బ్యాంకు ఆస్తుల పుస్తక విలువ రూ.3,63,400 కోట్లని సంస్థ అధికారప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణంగా ఆయా బ్యాంకుల ఆస్తుల విలువను లెక్కించి ర్యాంకింగ్‌లు కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం (2009-10)లో రూ.4,35,000 కోట్ల విలువైన మొత్తం వ్యాపారాన్ని (డిపాజిట్లు, రుణాలు కలిపి) చేసినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) ప్రకటించిన నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ తాజా ప్రకటన వెలువర్చింది. పీఎన్‌బీ రూ.2,96,643 కోట్ల విలువైన మొత్తం ఆస్తులను కలిగి ఉంది. ఇదిలా ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో ఐసీఐసీఐ బ్యాంక్ మొత్తం వ్యాపార విలువ పీఎన్‌బీ (రూ.4,35,000 కోట్లు) కంటే తక్కువగా రూ.3,83,223 కోట్లుగా నమోదవడం గమనార్హం. ర్యాంకు మాదే - పీఎన్‌బీ: 2009-10 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లు, రుణాలతో కూడిన సంస్థ మొత్తం ఆస్తుల విలువ రూ.4,35,000 కోట్లకు చేరిందని పీఎన్‌బీ ఇటీవల వెల్లడించింది. తద్వారా ఇప్పటివరకు దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా చలామణి అవుతున్న ఐసీఐసీఐ స్థానాన్ని తాము భర్తీ చేశామని కూడా పేర్కొంది.