ఆ దిశగా పయనిస్తున్నాం దశాబ్ద కాలం క్రితం మినీ సిమెంట్ కంపెనీగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన అంజనీ పోర్ట్‌లాండ్ సిమెంట్ రాష్ట్రంలో పెద్ద సిమెంటు కంపెనీల్లో ఒకటిగా ఆవిర్భవించనుంది. 1.2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంలో ఇప్పటికే 'మినీ' స్థాయి నుంచి ఎదిగింది. మరో నాలుగు సంవత్సరాల్లో సామర్థ్యాన్ని 3 మిలియన్ టన్నులకు పెంచుకొనే దిశగా సాగుతోంది. ఈనేపథ్యంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.విష్ణురాజు 'న్యూస్‌టుడే' కిచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు...
రూ.1000కోట్ల టర్నోవర్ సాధిస్తాంన్యూస్టుడే ఇంటర్వ్యూ
అంజనీ పోర్ట్‌లాండ్ సిమెంట్
ఎండీ కె.వి.విష్ణురాజు

విష్ణురాజు: నల్గొండ జిల్లా మేళ్లచెర్వులో ఇపుడు ఫ్యాక్టరీ ఉన్న ప్రదేశంలో దాదాపు రూ.182 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించాం. వాణిజ్య సరళి ఉత్పత్తిని గత మార్చి నెలాఖరులో ప్రారంభించాం. దీంతో మొత్తం సామర్థ్యం దాదాపు 1.2 మిలియన్ టన్నుల వరకు చేరింది. రూ.115 కోట్ల టెర్మ్ లోన్స్‌తో, ఇంకా అన్‌సెక్యూర్డ్ లోన్, అంతర్గత వనరులతో విస్తరణను పూర్తిచేశాం.
?మలి దశ విస్తరణ ప్రణాళిక
ఫ్యాక్టరీ ఆవరణలో 18 మెగా వాట్ల కేప్టివ్ విద్యుత్కేంద్రాన్ని స్థాపించబోతున్నాం. 15-16 మె.వా. విద్యుత్తును మా సొంత అవసరాలకు వినియోగించుకొని, మిగతాది గ్రిడ్ ద్వారా ఇతర వినియోగదార్లకు అందించాలనేది ప్రణాళిక. దీనికి అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసి అవసరమైన అనుమతులు తీసుకునే పనిలో ఉన్నాం. 2012 నాటికి పూర్తి అయ్యే ఈ ప్రాజెక్టుకు రూ.75 కోట్లు అవసరం.
ఇది కాకుండా కర్ణాటకలోని బీజాపూర్‌లో ఒక కొత్త సిమెంట్ యూనిట్‌ను కూడా నెలకొల్పనున్నాం. దీనికోసం 100 ఎకరాల ఫ్యాక్టరీ స్థలాన్ని, 550 ఎకరాల మైనింగ్ ఏరియాను సేకరించాం. 'అంజనీ సిమెంట్ కర్ణాటక లిమిటెడ్' పేరుతో అంజనీ పోర్ట్‌లాండ్ సిమెంట్ కంపెనీకి నూరు శాతం అనుబంధ కంపెనీగా దీన్ని నెలకొల్పుతాం. ముందుగా 1 మిలియన్ టన్ను యూనిట్‌ను స్థాపించే యోచన ఉంది. కేప్టివ్ పవర్ ప్లాంట్‌తో కలసి ఇందుకు రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నాం. 2012 సంవత్సరాంతం నాటికి పూర్తి అవుతుందని భావిస్తున్నాం.
?నిధుల సేకరణ..
రుణాలు, అంతర్గత వనరుల పైన ఆధారపడతాం. మాతృ సంస్థ (అంజనీ పోర్ట్‌లాండ్ సిమెంట్) నుంచి ఈక్విటీ షేర్ల ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ద్వారా మరికొన్ని నిధులు సమీకరించే యోచన ఉంది.
?సమీప భవిష్యత్తులో ఉత్పత్తి సామర్థ్యం, వార్షిక టర్నోవర్‌లు ఏ స్థాయిలో ఉండవచ్చు
నాలుగేళ్లలో 2.5 మి. టన్నుల నుంచి 3 మి. టన్నులకు చేరుకొంటాం. ఉత్పత్తి ప్రక్రియను హేతుబద్ధం చేయడం ద్వారా కొంత అదనపు సామర్థ్యం లభిస్తుంది. 2013- 14 ఆర్థిక సంవత్సరాంతానికి రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధించే స్థితిలో సంస్థ ఉంటుందని అంచనా.
?మార్కెటింగ్ సన్నాహాల గురించి వివరించండి
మేళ్లచెర్వు ప్లాంటు నుంచి సిమెంటును రాష్ట్రంలో అధికంగా, కొంత భాగం ఒరిస్సా, తమిళనాడుల్లో విక్రయిస్తున్నాం. కర్ణాటక, మహారాష్టల్లోనూ నమూనా విక్రయాలు మొదలుపెట్టాం. భవిష్యత్తులో బీజాపూర్ యూనిట్ నుంచి అక్కడికి దగ్గరగా ఉండే ఉత్తర కర్ణాటక, గోవా, మహారాష్ట్రలలో సిమెంటు విక్రయించాల్సి ఉంటుంది కాబట్టే ఈ ప్రయత్నం.
?భవిష్యత్తులో సిమెంటు రంగం ముఖచిత్రం
రాష్ట్రంలో వార్షిక వృద్ధి 20 శాతం ఉంది. దేశ వ్యాప్తంగా పరిశ్రమ 10- 12% వృద్ధి నమోదు అవ్వొచ్చు. గిరాకీ అధికంగా ఉన్నందున ధర స్థిరంగా ఉండే వీలు ఉంది. పరిశ్రమ ఆశాజనకంగా కనిపిస్తోంది.
సిమెంట్ టెక్నాలజీ ఏర్పాటు!