వచ్చే నెల 4 వరకు
భారత్‌లో ఇదే తొలి సారి
టెలికాం అభివృద్ధికి ప్రణాళిక ..
హైదరాబాద్, న్యూస్‌టుడే: ప్రతి నాలుగు సంవత్సరాలకు జరిగే ప్రపంచ టెలికమ్యూనికేషన్ అభివృద్ధి సమావేశానికి (డబ్ల్యూటీడీసీ) ఈ సారి హైదరాబాద్ వేదిక కానుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సమావేశం భారత్‌లో జరగడం ఇదే ప్రథమం. దేశీయ టెలికమ్యూనికేషన్స్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు అయిదో డబ్ల్యూటీడీసీని అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) ఇక్కడ నిర్వహిస్తోంది. బ్యూనస్ ఎయిర్స్‌లో తొలి సమావేశం 1994లో జరిగింది. ఐటీయూ ఐక్యరాజ్య సమితికి చెందింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్స్ అంశాలను పర్యవేక్షిస్తుంది. దాదాపు 50 దేశాల నుంచి 600 మందికి పైగా ప్రతినిధులు హైదరాబాద్ సమావేశానికి వచ్చే వీలు ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 500 ప్రతినిధులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో ప్రభుత్వం అధికారులు, మంత్రులు, రాయబారులు, టెలికాం కంపెనీల ప్రతినిధులు ఉన్నారు. భారత టెలికాం విభాగం తరఫున కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి ఎ.రాజా విచ్చేయనున్నారు. టెలికాం శాఖ, టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. వేదిక: హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని అంతర్జాతీయ సమావేశ మందిరం (హెచ్‌ఐసీసీ). సోమవారం (24 తేదీ) నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశం జూన్ 4 వరకు 12 రోజుల పాటు కొనసాగుతుంది.
లక్ష్యాలు: సమాచార సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్స్ టెక్నాలజీలు (ఐసీటీ) అభివృద్ధికి ప్రాధామ్యాలను గుర్తించడం. సభ్య దేశాల సలహాలు తీసుకోవడం. వచ్చే నాలుగేళ్లకు కార్యచరణ ప్రణాళికలను రూపొందించడం.
* 2006లో దోహాలో ప్రకటించిన కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుతెన్నులను పరిశీలించడం.
* 25న ప్రపంచ టెలికాం అభివృద్ధి నివేదిక విడుదల.
* 26న మూడు ఐటీయూ నివేదికల విడుదల.
చర్చించే అంశాలు
* విధాన, నియంత్రణల్లో వస్తున్న సంస్కరణలు.
* సాంకేతిక, నిర్వహణ సమస్యలు, అధిగమించే మార్గాలు
* స్పెక్ట్రమ్ నిర్వహణ, డిజిటల్ బ్రాడ్‌కాస్టింగ్
* టెలికమ్యూనికేషన్స్ అభివృద్ధికి ప్రాంతీయంగా చేపడుతున్న చర్యలు, ప్రాజెక్టులు. * ఇ-ఆరోగ్యం* ఐసీటీ అభివృద్ధికి నిధుల సమీకరణ మార్గాలు, భాగస్వామ్యాలు.