Saturday, May 8, 2010

త్రిశంకు స్వర్గంలో 'దాద్రీ'!

న్యూఢిల్లీ: అంబానీ సోదరుల గ్యాస్‌ వివాదంపై సుప్రీం కోర్టు తాజా తీర్పుతో దాద్రీ విద్యుత్తు ప్రాజెక్టు భవిష్యత్తు మరోమారు ప్రశ్నార్ధకంగా మారింది. తీర్పు నేపథ్యంలో దాద్రీ ప్రాజెక్టుకు గ్యాస్‌ అందుతుందో లేదో, ఇక్కడ ప్రాజెక్టు మొదలవుతుందో లేదో అని సందేహాలు మరోమారు జోరందుకున్నాయి. రిలయన్స్‌ ఎనర్జీ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గజియాబాద్‌ జిల్లాలోని దాద్రీలో రూ.10,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ విద్యుత్తు ప్రాజెక్టుకు మొదటి నుంచి సమస్యలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ భూసేకరణ మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే స్థానిక రైతుల నుంచి తీవ్రస్థాయి వ్యతిరేకత ఎదురైంది. ప్రాజెక్టుకు అవసరమైన గ్యాస్‌ కేటాయింపుల అంశం కూడా వివాదాల్లో నానుతోంది. రిలయన్స్‌ ఎనర్జీ జనరేషన్‌ సంస్థ గత ఆరేళ్ల నుంచి ఇక్కడ ప్రహారీ గోడ నిర్మించడం తప్ప ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టలేదు. తాజాగా సుప్రీంకోర్టు ఉత్తర్వులతో 3750 మె.వా. సామర్థ్యంతో నిర్మించనున్న ప్రాజెక్టు మొదటి దశ త్రిశంకు స్వర్గంగా మారింది. వివాదాస్పదంగా మారిన ఈ ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి అలహాబాద్‌ హైకోర్టు ఇప్పటికే తీర్పునిస్తూ దాద్రీ రైతులకు భూమిని తిరిగి ఇచ్చేయాల్సిందిగా ఆదేశించింది. ఇదే అంశంపై రిలయన్స్‌ ఎనర్జీ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తీర్పు రావాల్సి ఉంది.రిలయన్స్‌ గ్యాస్‌పై సుప్రీం వెలువరించిన తీర్పు ప్రభావం దాద్రీ రిలయన్స్‌ పవర్‌ ప్లాంటుపై ఉండకపోవచ్చని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ కె.రవిచంద్రన్‌ అభిప్రాయపడ్డారు.