Tuesday, May 11, 2010

భావి వ్యవసాయానికి సరికొత్త రూపం

భావి వ్యవసాయానికి సరికొత్త రూపం
గాలిలో, నీటిలో మొక్కల పెంపకం
విదేశాల్లో కంపెనీల ప్రయోగాలు
సామగ్రిని విక్రయిస్తున్న న్యూయార్క్‌, కెనడా కంపెనీలు
వ్యవసాయం అంటే పొలంలో పంట పండిస్తారన్న విషయం అందరికీ తెల్సిందే. అయితే పట్టణీకరణ ఇప్పటికే ఎన్నో పంట పొలాలకు ఎసరు పెట్టింది. మరో పక్క ఆహార పదార్థాలకు గిరాకీ పెచ్చుపెరుగుతోంది. కుదించుకుపోయే సేద్య విస్తీర్ణం, అడుగంటిపోయే భూసారాన్ని దృష్టిలో ఉంచుకుని మానవ మేధ ఒక సరికొత్త ఆలోచన చేస్తోంది. అదేమిటంటే...
అసలు భూమి లేకుండా పంటను పండిస్తేనో..? ఇది సాధ్యమేనా!
పట్టుదల, కృషి ఉంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు.... మొక్కలకు ఆధారభూతంగా ఒక వేదిక, నీరు, ఇతర పోషకాలు ఉంటే చాలు, పెరిగి పెద్దవవడానికి నేల అక్కరలేదని శాస్త్రవేత్తలు ఇదివరకే నిరూపించారు. గాలిలో పెంచే మొక్కలకు (దీనినే ఏరోపానిక్స్‌ విధానం అంటున్నారు), క్షేత్రాల్లో ఉండే మొక్కలు పీల్చుకొనే జలంలో పది శాతం సమకూరిస్తే సరిపోతుంది. ఇకపోతే హైడ్రోపానిక్స్‌ అని మరో పద్ధతి ఉంది. దీనినే ఆక్వాపానిక్స్‌ అని కూడా పిలుస్తున్నారు. ఇందులో మొక్కల పెంపకానికి నేలకు బదులుగా నీటిని గాని, ఇసుకను గాని వాడుతారు.

అమెరికాలోని న్యూయార్క్‌ స్టేట్‌లో ఇతాక వద్ద ఏరోఫామ్స్‌ అనే ఒక కంపెనీ పొలమేమీ లేకుండానే పైరును పెంచేందుకు అనువైన సామగ్రిని విక్రయిస్తోంది. వాణిజ్య సరళిలో సస్య సృష్టికి సింగపూర్‌ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక భవనాల్లో నిలువుగా ఉండే క్షేత్రాల (వర్టికల్‌ ఫామ్స్‌) ఏర్పాటుకు దోహదం చేసే సరికొత్త సాంకేతిక పద్ధతులపై ప్రపంచంలో అనేక చోట్ల పలు కంపెనీలు ప్రాథమిక స్థాయి ప్రయోగాలు జరుపుతున్నాయి. బ్రిటన్‌లోని కార్న్‌వాల్‌లో ఉన్న ఈడెన్‌ ప్రాజెక్టులో వేర్వేరు శీతోష్ణస్థితులను నియంత్రించగలిగిన భారీ గుమ్మటాలను నిర్మించారు. వీటి కింద ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందిన మొక్కలనైనా పెంచవచ్చని చెప్తున్నారు. బయోమ్‌లుగా పిలిచే ఈ గుమ్మటాల తయారీకి ఎథిలీన్‌ టెట్రాఫ్లూరోఎథిలీన్‌ అనే పదార్థాన్ని ఉపయోగించారు. ఈ రకమైన గుమ్మటాలు బహుళ అంతస్తుల భవనాల్లో పెద్ద ఎత్తున 'వర్టికల్‌ ఫార్మింగ్‌'కు అనువైనవని డిక్‌సన్‌ డెస్పోమియర్‌ అంటున్నారు. ఆయన కొలంబియా యూనివర్సిటీలో ప్రజారోగ్య ఆచార్యుడు. పదేళ్ల కిందట మొట్టమొదటిసారిగా వర్టికల్‌ ఫార్మింగ్‌ ప్రతిపాదనను తీసుకు వచ్చింది ఆయనే. సుమారు 30 అంతస్తులతో కూడిన ఒక భవనంలో తొలుత కాయగూరల మొక్కలు, ఆ తరువాత ఇతర మొక్కలను మట్టి లేకుండా కనీస ఇన్‌పుట్స్‌తో వర్టికల్‌ ఫారమ్‌ వాతావరణంలో పెంచాలనేది డెస్పోమియర్‌ సూత్రం. షికాగోలో ఒక పాత గోదామును సరికొత్త వర్టికల్‌ ఫారమ్‌గా ఇలినాయిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మార్పిడి చేస్తోంది. కెనడాకు చెందిన వాల్సెంట్‌ ప్రోడక్ట్స్‌ అనుబంధ కంపెనీ పొలం లేకుండా పైరు పెంచండంటూ అందుకు తగ్గ పరికరాలను కార్న్‌వాల్‌లో విక్రయించనుంది. ఇక వర్టికల్‌ ఫామ్స్‌కు చూడముచ్చటైన వాస్తు నమూనాలను ప్యారిస్‌లో ఎస్‌ఓఏ, సియాటెల్‌లోని వెబర్‌ థాంప్సన్‌ డిజైన్‌, బ్రసెల్స్‌లోని విన్సెంట్‌ కాల్‌బాట్‌ల వంటి ప్రముఖ భవన నిర్మాణ కంపెనీలు మేము అందిస్తామంటూ చొరవ తీసుకోవడం బట్టి ఈ తరహా ప్రాజెక్టులపై వ్యాపార పరంగా అప్పుడే భలే ఆసక్తి మొదలైనట్లు అర్థం అవుతుంది. వర్టికల్‌ ఫారమ్‌లలో అటు ఏరోపానిక్స్‌ను, ఇటు హైడ్రోపానిక్స్‌ను.. ఈ రెండింటినీ వినియోగించుకొనే వీలు ఉంటుంది. పైగా ఈ రెండు పద్ధతుల్లోనూ పురుగుమందుల అవసరం గణనీయంగా ఏమీ ఉండదు కూడా.

కృత్రిమ ఎండలు
ఇప్పటికిప్పుడు ఏరోపానిక్స్‌ సాంకేతికంగా ఎంతవరకు ఆచరణ సాధ్యమని కొందరు పరిశోధకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వేర్వేరు కంపెనీలు అనుసరిస్తున్న పద్ధతులు, వేర్వేరు సంస్థలు ప్రోత్సహిస్తున్న రీతులలో గణనీయమైన వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఉదాహరణకు ఏరోఫామ్స్‌ అనే కంపెనీ కృత్రిమ కాంతి ప్రసారానికీ మొగ్గు చూపింది. ఎల్‌ఈడీ లైటింగ్‌ను ఈ కంపెనీ ఉపయోగిస్తోంది. డెస్పోమియర్‌ మాత్రం ఏటవాలు అద్దాలను, ఆప్టిక్‌ ఫైబర్స్‌ను వాడి సూర్యకాంతిని భవనంలోకి పరావర్తనం అయ్యేలా చూస్తానంటున్నారు.

ఇంధన వ్యయమే కీలకం
వర్టికల్‌ ఫామ్స్‌కు కావలసిందల్లా ఇంధనం. ఇదే దీని కీలకమైన ముడిపదార్థం. ఇంధనానికి అయ్యే ఖర్చే ఈ ప్రయోగం ఆర్థికంగా విజయవంతం అవుతుందీ లేనిదీ తేల్చివేస్తుంది. అయితే డెస్పోమియర్‌ దీనికి కూడా తన దగ్గర ఒక సమాధానం ఉందంటున్నారు. మున్సిపల్‌ వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.

ఈ రకంగా మట్టి జోలి లేని ఫామ్స్‌ కృత్రిమ కాంతిని, ఇంధనాన్ని ఉపయోగించుకొంటూ రాత్రి, పగలు ఏడాది పొడవునా నిరంతరాయంగా ఆహారాన్ని అందిస్తూ పోతే ఒక పెను సవాలుకు పరిష్కారం దొరికినట్లే.. అంత కన్నా మానవాళికి కావలసింది ఏముంటుంది?