Saturday, May 15, 2010

ఆదాయపు పన్నుబాదుడు!

శ్లాబుల్లో మార్పులకు ఆర్థికశాఖ కసరత్తు
రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు
ఆ తర్వాతే అసలు వడ్డింపు?
జూన్‌ 15 నాటికి డీటీసీ తుది ముసాయిదా
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చెల్లింపుదార్లకు ఆశాభంగం..! వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే కొత్త పన్నురేట్లు ప్రయోజనం చేకూరుస్తాయని భావిస్తున్న వర్గాలకు.. ముఖ్యంగా వేతన జీవులకు నిరాశ కలిగించే ప్రతిపాదనలు ముందుకు రాబోతున్నాయి! ప్రత్యక్ష పన్నుల స్మృతి (డీటీసీ) తొలి ముసాయిదా ప్రకారం.. రూ.1.60 లక్షల వార్షిక ఆదాయం పొందేవారు ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబుకు అనుగుణంగానే ఉంది. కాని.. సవరించబోయే ప్రతిపాదనల ప్రకారం పన్ను చెల్లించనక్కర్లేని ఆదాయపు పరిమితి రూ.2 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. అంటే అదనంగా మరో రూ.40000 వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత మారబోయే శ్లాబులే ఆందోళన కలిగిస్తున్నాయి. డీటీసీ తొలి ప్రతిపాదనల ప్రకారం రూ.10 లక్షలు పైబడి రూ.25 లక్షల లోపు ఆదాయం ఉన్న 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు రూ.10 లక్షలు పైబడిన వార్షికాదాయం పొందేవారిని 30 శాతం శ్లాబులోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత ఏడాది ఆగస్టులో విడుదల చేసిన డీటీసీ ముసాయిదాపై వివిధ వర్గాల అభిప్రాయ సేకరణ ఆధారంగా పన్ను శ్లాబుల్లో ఆర్థిక శాఖ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. తుది ముసాయిదా జూన్‌ 15 నాటికి సిద్ధమవుతుందని భావిస్తున్నారు. ఆర్థిక శాఖ తాను ఇవ్వజూపే కొన్ని రాయితీలను సర్దుబాటు చేసుకోవడానికి పన్ను శ్లాబుల్లో మార్పులు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలిక పొదుపు ఖాతాలు, కంపెనీలపై విధించే కనీస ప్రత్యామ్నాయ పన్ను (ఎంఏటీ) తదితరాలకిచ్చే మినహాయింపుల వల్ల కలిగే లోటును భర్తీ చేసుకునేందుకే తాజా ప్రతిపాదనలని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

భవిష్యనిధి (పీఎఫ్‌), పింఛను వంటి దీర్ఘకాలిక పొదుపు పథకాలపై ప్రస్తుతం కొనసాగిస్తున్న మినహాయింపు-మినహాయింపు-మినహాయింపు (ఈఈఈ) పద్ధతినే కొనసాగించే అవకాశాలున్నాయి. వీటిపై మినహాయింపు-మినహాయింపు-పన్ను (ఈఈటీ) పద్ధతిని అనుసరించాలని తొలుత ప్రతిపాదించారు. దీని ప్రకారం.. ప్రయోజనపు సొమ్మును విత్‌డ్రా చేసుకునే సమయంలో పన్ను విధిస్తారు. ఈఈఈ పద్ధతిలో ఎటువంటి పన్నూ ఉండదు. గృహనిర్మాణ రుణాల విషయంలోనూ ఎటువంటి మినహాయింపులు ఉండకపోవచ్చు. బీమా తదితర పొదుపు పథకాలపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతున్న కారణంగా ఇంటి రుణాలపై మినహాయింపు అవసరం లేదని ఆర్థికశాఖ భావిస్తోంది. పొదుపు పథకాల ప్రస్తుత పరిమితి రూ.లక్ష ఉండగా దాన్ని రూ.3లక్షలు చేయాలని ప్రతిపాదించారు. తుది ముసాయిదాను వివిధ వర్గాల అభిప్రాయాల కోసం 15 రోజుల పాటు అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత మంత్రిమండలి ఆమోదానికి పంపుతారు.