Friday, May 21, 2010

చమురు, గ్యాస్‌ ఉత్పత్తి నిలిపివేత

ఎంఏ క్షేత్రంలో మాత్రమే: రిలయన్స్‌
లైలా తుపాను ప్రభావంతో నిర్ణయం
న్యూఢిల్లీ: లైలా తుపాను వల్ల నష్టపోకుండా చూసేందుకు బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసిన్‌ పరిధిలో ఉన్న ఎంఏ క్షేత్రంలో ముడిచమురు, గ్యాస్‌ ఉత్పత్తిని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ముందస్తుగా నిలిపివేసింది. అధిక ఫలప్రదమైన కేజీ -డీ6 బ్లాకులోని ఎంఏ క్షేత్రంలో గ్యాస్‌, ముడిచమురు ఉత్పత్తిని మంగళవారమే నిలిపివేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ధీరూబాయ్‌ 1, 3 క్షేత్రాల్లో గ్యాస్‌ ఉత్పత్తికి మాత్రం ఎటువంటి ఆటంకాలు ఏర్పడలేదు. ఎంఏ క్షేత్రాల నుంచి రోజుకు 32,000 - 33,000 బ్యారెళ్ల చమురు, 8 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల (ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్‌ ఉత్పత్తి అవుతోంది. కనీసం 48 గంటల పాటు ఇక్కడ ఉత్పత్తి నిలిపి వేస్తున్నారు. ఈ పరిణామాల వల్ల కేజీ-డీ6 క్షేత్రంలో మొత్తం గ్యాస్‌ ఉత్పత్తి 63 ఎంఎంఎస్‌సీఎండీ నుంచి 55కు తగ్గింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు కంపెనీ అధికార ప్రతినిధి నిరాకరించారు. కేజీ-డీ6తో పాటు కేజీ-డీ3 బ్లాకుల్లో డ్రిల్లింగ్‌ కార్యకలాపాలనూ రిలయన్స్‌ ప్రస్తుతానికి ఆపింది.

ఓఎన్‌జీసీతో బీపీ చర్చలు : కేజీ బేసిన్‌లోని గ్యాస్‌ బ్లాక్‌కు సంబంధించి వ్యూహాత్మక ఒప్పందం చేసుకునేందుకు బీపీ, ఎగ్జాన్‌ మొబిల్‌, బీజీ గ్రూప్‌, ఎనీ, బీహెచ్‌పీ బిలిటన్‌ వంటి 5 విదేశీ సంస్థలతో ఓఎన్‌జీసీ చర్చలు జరుపుతోంది. 'సముద్ర గర్భంలో నుంచి గ్యాస్‌ వెలికితీతకు అన్వేషణ సంస్థలు, అనుభవజ్ఞుల కోసం చూస్తున్నాం. కేజీ బేసిన్‌ బ్లాక్‌ వివరాలను అంతర్జాతీయ సంస్థలకు అందుబాటులో ఉంచాం. ఈ నెలాఖరుకు స్పందన వస్తుంది' అని ఓఎన్‌జీసీ డైరెక్టర్‌ (అన్వేషణ) దినేష్‌ పాండే చెప్పారు.