Wednesday, March 24, 2010

11వ ప్రణాళిక వృద్ధి రేటు కుదింపు

9% కాదు.. 8.1 శాతమే
న్యూఢిల్లీ: పదకొండో పంచవర్ష ప్రణాళికలో జీడీపీ వృద్ధి రేటు 8.1 శాతానికి పరిమితం కావచ్చని మంగళవారం నాటి మధ్య కాలిక సమీక్ష (ఎంటీఏ) సందర్భంగా తీర్మానించారు. ఇంతకు ముందు దీనిని 9 శాతంగా అంచనా వేశారు. ఈ ప్రణాళిక కాలంలో సగటు వృద్ధి రేటు 8 శాతం కన్నా కాస్త ఎక్కువగా, బహుశా 8.1 శాతంగా ఉండవచ్చని ఎంటీఏ పేర్కొంది. ఇదే జరిగితే పదో పంచవర్ష ప్రణాళికలో సాధించిన 7.8 శాతం కన్నా మెరుగేనని చెప్పుకోవచ్చు. వచ్చే 2010-11కు మాత్రం 8.5 శాతం వృద్ధి రేటు నమోదు కావచ్చని వ్యాఖ్యానించింది. ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ అధ్యక్షత వహించిన పూర్తి స్థాయి ప్రణాళికా సంఘం సమావేశానికి ఎంటీఏను నివేదించారు. 11వ ప్రణాళిక చివరి సంవత్సరమైన 2011-12లో భారత ఆర్థిక వ్యవస్థ 9 శాతం మేర పురోగమించవచ్చని ప్రణాళికా సంఘం తలపోస్తోంది. ఎంటీఏ నివేదికకు పూర్తి స్థాయి ప్రణాళికా సంఘం ఆమోదం లభించిన అనంతరం కేంద్ర మంత్రివర్గం పరిశీలనకు పంపుతారు. తరువాతి దశలో అది జాతీయాభివృద్ధి మండలి పరిశీలనకు వెళ్తుంది.

మాంద్యం ముంచింది.. 'మౌలిక' పెట్టుబడులు కీలకం: ఈ ప్రణాళిక మొదటి సంవత్సరం (2007-08)లో వృద్ధి రేటు ఆశించిన విధంగా 9% ఉన్నా, మరుసటి సంవత్సరంలో ప్రపంచ మాంద్యం కారణంగా ఆ జోరుకు కళ్లెం పడినట్లు ఎంటీఏ నివేదిక వివరించింది. 2008-09లో భారత్‌ 6.7 శాతం వృద్ధిని చూసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రంగం నుంచి సరైన తోడ్పాటు అందకపోయినప్పటికీ 7.2 శాతం వృద్ధి రేటు సాధ్యపడేటట్లుంది. ఆర్థిక స్థిరీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని పరిరక్షించాలని ప్రభుత్వానికి ప్రణాళికా సంఘం సూచించింది. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల కల్పన (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం కీలకం కాగలదని పేర్కొంది.