Tuesday, March 30, 2010

ఎఫ్‌డీఐలు అంతంతే!

న్యూఢిల్లీ: భారతదేశం అత్యంత ఆకర్షదాయక, శరవేగంతో విస్తరిస్తున్న టెలికామ్‌ మార్కెట్‌గా ఉన్నప్పటికీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతీయ టెలికాం పరిశ్రమపై శీతకన్ను వేసినట్లుగా ఉంది. ఏప్రిల్‌ 9న జరిగే 3జీ వేలంలో పాల్గొంటున్న 9 కంపెనీల యాజమాన్యాల తీరుతెన్నులను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ కంపెనీల్లో సగటు ఎఫ్‌డీఐలు 40 శాతానికి మించలేదు. టెలికామ్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల స్థాయి అధికంగా ఉందని భావించే సాధారణ నమ్మకానికి భిన్నంగా ఈ గణాంకాలున్నాయి. గతం లో టెలికామ్‌ రంగంలో ఎఫ్‌డీఐలపై 49 శాతం పరిమితి ఉండేది.

ఐదేళ్ళ క్రితం దీన్ని 74 శాతానికి పెంచారు. అయినప్పటికీ విదేశీ పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం లేదు. దీనికి తోడు 3జీ వేలంపై ఎఫ్‌డీఐలు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. టెలికాం రంగంలోకి తాజాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వస్తాయన్న ఆశలను ఇది వమ్ము చేసింది. అంతేగాకుండా, 3జీ వేలం ద్వారా రూ. 40 వేల కోట్ల దాకా భారీ మొత్తాన్ని సముపార్జించవచ్చని భావించిన టెలికాం శాఖ మంత్రి ఎ. రాజా ఆశలపై నీళ్ళు చల్లింది. ఈ తొమ్మిది మంది బిడ్డర్లలో వోడాఫోన్‌ మాత్రమే అత్యధికంగా 70.9 శాతం ఎఫ్‌డీఐలను కలిగిఉంది. ఇందులో వోడాఫోన్‌ పెట్టుబడులతో పాటుగా ఎస్సార్‌ సొంత ఎఫ్‌డీఐలూ కలసి ఉన్నాయి.

ఎయిర్‌సెల్‌ ఈ విషయంలో రెండో స్థానంలో నిలిచింది. ఇందులో గ్లోబల్‌ కమ్యూకేషన్‌ సర్వీసెస్‌ హోల్డింగ్‌ (జీసీఎస్‌హెచ్‌) 64.9 శాతం మేర వాటాను కలిగి ఉంది. దక్కన్‌ డిజిటల్‌ లోనూ జీసీఎస్‌హెచ్‌కు 25 శాతం మేర వాటా ఉండడం విశేషం. ఆ విధంగా చూస్తే ప్రత్యక్ష, పరోక్ష మార్గాల ద్వారా ఎయిర్‌సెల్‌లో 74 శాతం మేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్నట్లు లెక్క తేలుతుంది. ఇతిసాలత్‌ సంస్థ, ఎస్‌టెల్‌లలో కూడా ఎఫ్‌డీఐలు గణనీయంగానే ఉన్నాయి. ఇతిసాలత్‌ ఇండియాలో ఇతిసాలత్‌ మారిషస్‌ సంస్థ 44.73 శాతం దాకా పెట్టుబడులను కలిగిఉంది.

ఎస్‌టెల్‌లో బహ్రెయిన్‌ కేంద్రంగా పని చేస్తున్న బీఎంఐసీ లిమిటెడ్‌ 42.7 శాతం దాకా వాటా కలిగిఉంది. భారతి ఎయిర్‌టెల్‌, ఐడియా రెండూ కూ డా సుమారు 40 శాతం దాకా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కలిగి ఉన్నా యి.15.5 శాతం వాటాతో పిస్టెల్‌ లిమిటెడ్‌ సంస్థ భారతి ఎయిర్‌టెల్‌లో అధి మొత్తంలో వాటా కలిగిఉంది. టీఎంఐ, పీ5 ఆసియా ఇన్వెస్ట్‌మెంట్స్‌ సంస్థలు ఐడియాలో 40.5 శాతం దాకా వాటా కలిగిఉన్నాయి. టాటాలు 34.1 శాతం మేర విదేశీ ప్రత్యక్షపెట్టుబడులను కలిగిఉన్నారు. వీటిల్లో ఎన్‌టీటీ డొకొమొ అ దిక శాతం వాటాను కలిగిఉంది. దానికి 26.5 శాతం మేర వాటా ఉంది. నూట కి నూరు శాతం భారతీయ పెట్టుబడులను కలిగిఉంది వీడియోకాన్‌ మాత్రమే.

23 ఎఫ్‌డీఐలకు ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం సోమవారం నాడిక్కడ రూ. 2,325.21 కోట్ల విలువైన 23 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనలను ఆమోదించింది. ఇందులో బ్రాడ్‌బాండ్‌ సర్వీ స్‌ ప్రొవైడర్‌ టికోనా డిజిటల్‌ నెట్‌వర్క్‌, ఆటో విడి భాగాల తయారీ సంస్థ భారత్‌ ఫోర్జ్‌ల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. టికోనా సంస్థ రూ. 1,142.21 కోట్ల మొత్తంతో భారీ ప్రతిపాదనను కలిగిఉంది. కళ్యాని గ్రూప్‌ కంపెనీ భారత్‌ ఫోర్జ్‌ ప్రతిపాదన విలు రూ. 576 కోట్ల మేరకు ఉంది. ఎస్సార్‌ క్యాపిటల్‌ హోల్డింగ్‌, వెరిజోన్‌ కమ్యూనికేషన్స్‌ తదితర 8 సంస్థల ప్రతిపాదనలను వాయిదా వేసింది.