Saturday, March 27, 2010

చైనాలో భారత ఐటీ ప్రదర్శన

బీజింగ్‌: ఆసియా ఖండంలో అభివృద్ధిలో పోటీపడుతు న్న భారత్‌-చైనాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఐటి రంగంలో రాణిస్తున్న భారత్‌ ఈ ఒక్క విషయంలో చైనాను కొంచెం వెనక్కు నెట్టింది. అందుకు కారణం మనదేశంలో ఇంగ్లీష్‌ భాష మాట్లాడే వారు ఎక్కువగా ఉండడమే. ఈ నేపథ్యంలో భారత ఐటి పరిశ్రమ తన బలాన్ని చాటడానికి చైనాను వేదికగా ఎంచు కుంది. శుక్రవారం నుండి ఇక్కడ ఐటి రంగంపై తన భారీ ప్రచారాన్ని ప్రారంభించింది. అలాగే రెండు దేశాల మధ్య ఐటి వ్యాపారంలో ఉన్న అసమానతను తగ్గించడం కూడా బల ప్రదర్శన ఉద్దేశంగా కనిపిస్తోంది.

ఈ సందర్భంగా భారత ఐటి రంగంపై ప్రదర్శన ఇచ్చేందుకు నాస్కామ్‌ అధ్యక్షుడు సోమ్‌ మిట్టల్‌, భారత ఐటి దిగ్గజాలైన కంపెనీల ప్రతినిధులతో కలసి బీజింగ్‌ వెళ్ళారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో చైనాకు చెందిన 300 టాప్‌ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఇందులో ప్రభుత్వ కంపెనీ లు కూడా ఉన్నాయి. ‘ఇండియా-చైనా బిజినెస్‌ టెక్నాలజీ సమ్మిట’్‌ పేరిట ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. చైనా ఐటి శాఖ ఉపమంత్రి లోక్వింజియన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చైనాలో భారత రాయభారి ఎస్‌.జయశంకర్‌ మాట్లాడుతూ ఐటి రంగంలో భారత్‌ తన ప్రాధాన్యతను, పోటీతత్వాన్ని ఏనాడో నిరూపించుకుందని, కాబట్టి మన దేశం ఎటు వంటి ప్రత్యేక సహాయ, సహకా రాలు కోరుకోవడం లేదని చెప్పారు. పైగా చైనా ఐటి కంపె నీలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు మార్గదర్శనం చేస్తామని చెప్పారు. తక్కువ ధరకు సేవలందించడంతో పాటు నాణ్యతకు భారత ఐటి కంపెనీలు పెద్ద పీట వేస్తా యని, ఈ విషయాన్ని చైనా కంపెనీలు అనుసరించాల్సి ఉందన్నారు. ఈ ఏడాది చైనాతో భారత్‌ వ్యాపారం 42 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇందులో భారత్‌ దిగు మతులు 32 బి.డాలర్లు ఉండగా, ఎగుమతులు కేవలం 9.5 బి.డాలర్లుగా ఉన్నాయి. భారత్‌ నుండి ముడి ఇనుప ఖనిజం, నూనె గింజలను చైనా ప్రధానంగా దిగుమతి చేసుకుంటోంది.

చైనాకు చెందిన ఐటి కంపెనీలను ఆకర్షిం చడానికి వీలుగా భారత్‌ ఈ ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఇటీవల కాలంలో చైనా కూడా భారత ఐటి వ్యాపారంపై దృష్టి సారిస్తోంది. రానున్న కొద్ది నెలలలో ఐటి, ఫార్మా, ఇంజనీరింగ్‌ సేవలు, వ్యవసాయ ఉత్పత్తులలో భారత్‌ చైనా మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వగలదని జయశంకర్‌ పేర్కొన్నారు. చైనా మార్కెట్లో భారత కంపెనీలు పెద్దగా రాణించకపోవడానికి అనేక కారణాలున్నాయని, తద్వారా రెండు దేశాల మధ్య వ్యాపార అసమానతలు ఏర్పడుతున్నాయని, రెండు దేశాలు ఈ సత్యాన్ని అంగీకరిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ ఐటి సదస్సు రెండు దేశాల మధ్య ఉన్న వ్యాపార అసమానతను పోగొట్టి అధికారికంగా రెండు దేశాలు పరస్పర సహకారం అందించుకోవడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. గత ఏడాది చైనా ఐటి రంగంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొందని, ప్రస్తుతం రికవరీ ఛాయలు కనిపిస్తున్నా యని చైనా ఉప మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చైనా భారత్‌ ఐటి వ్యాపారంతో పోటీ పడేందుకు తగిన విధానాలను అలవరుచుకోవాలని, సమీకృత భాగస్వామ్య ఒప్పందాలకు తెరతీయాలని కోరారు. వ్యవసాయ రంగంలో ఐటి సేవలను అమలు చేసేందుకు చైనా ప్రభుత్వం రైతులకు వెయ్యి యువాన్లకే కంప్యూటర్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

చైనాలో పాగాకు ఇదే తగిన సమయం: సోమ్‌ మిట్టల్‌
చైనాలో ఉన్న భారత ఐటి కంపెనీలు ఇప్పటిదాకా తమ సేవలను ఈ ప్రాంతంలోని బహుళ జాతి కంపెనీలకు మాత్రమే సేవలందిస్తూ వచ్చాయని, అయితే చైనా దేశీయ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు ఇదే తగిన సమయమని నాస్కామ్‌ అధ్యక్షుడు సోమ్‌ మిట్టల్‌ అన్నారు. టాటా కన్సె ల్టెన్సీ సర్వీసెస్‌ ఆసియా పసిఫిక్‌ విభాగం అధ్యక్షుడు గిరిజా పాండేతో కలసి మిట్టల్‌ భారత్‌ ఐటి పరిశ్రమపై పెద్ద ప్రదర్శన ఇచ్చారు.
భారత్‌లో చైనా కంపెనీలు రాణిస్తున్నట్లు, ఇక్కడ భారత కంపెనీలు ప్రగతి సాధించడం లేదని, మన విశ్వసనీ యతను మరికొంత నిరూపించుకోవడం ద్వారా అభివృద్ధి చెందవచ్చునని చెప్పారు.

చైనా దేశీయ ఐటి వ్యాపారం 15 బిలియన్‌ డాలర్లుగా ఉందని, దీనిని అందిపుచ్చుకోవడానికి భారత కంపెనీలు వ్యూహ రచన చేయాలని కోరారు. చైనా ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదర్చుకుని ఇక్కడ ఐటి సేవల వ్యాపారం నిర్వహిస్తున్నామని గిరిజా పాండే పేర్కొన్నారు. చైనా పరిస్థితులకు అనుగుణంగా భారత కంపెనీలు సంబంధాలు పెంచుకోవాలని, సీనియర్‌ హోదాలలో చైనీయులనే నియమించాలని, సేవలు చైనాలోని అన్ని ప్రాంతాలకు అందేలా చూసుకోవాలని అన్నారు. కాలాని కి అనుగుణంగా పెట్టుబడుల పెట్టాలని, తమ సంస్థ ఇక్కడ బాగా ఎదిగిందని, నాలుగు పెద్ద బ్యాంక్‌లకు సాంకేతిక సేవలు అందిస్తున్నామని, ఐడిసి నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించామని తెలిపారు.భారత ఐటి సంస్థలైన విప్రో నుంచి సుచిత్ర అయ్యర్‌, జయకుమార్‌, హెచ్‌సిఎల్‌ నుండి సి.పి.తిమ్మయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ ఐటీ సంస్థలు అందిస్తున్న సేవల పట్ల చైనాలో ఆసక్తి వ్యక్తం కావడం విశేషం.