Wednesday, March 24, 2010

ఐదేళ్లలో గ్యాస్‌కు రెండింతల డిమాండ్

న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్ల కాలంలో దేశంలో సహజవాయువుకు డిమాండ్ సుమారు రెండింతలు పెరిగే అవకాశం ఉందని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే తన అధ్యయనం లో పేర్కొంది. 2015 నాటికి భారత్‌లో నేచురల్ గ్యాస్ వినియోగం రోజుకి 320 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లకు (ఎంఎంఎస్‌సిఎండి) పెరుగుతుందని మెకిన్సే వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలో గ్యాస్‌కు డిమాండ్ 166 ఎంఎంఎస్‌సిఎండిగా ఉందని ఇందులో 132 ఎంఎంఎస్‌సిఎండి దేశంలోని గ్యాస్ క్షేత్రాలనుంచి సరఫరా అవుతుండగా మిగతా ఎల్ఎన్‌జిని దిగుమతి చేసుకుంటున్నట్లు సంస్థ తెలిపింది.గ్యాస్ డెలివరీ ధర బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 10-11 డాలర్లు ఉంటే వినియోగం 280 ఎంఎంఎస్‌సిఎండిగా ఉండేది. ఈ వివరాలతో కూడిన నివేదికను మెకిన్సే ఆరో ఆసియా గ్యాస్ పార్టనర్ షిప్ సమ్మిట్ విడుదల చేసింది.

2015 నాటికి గ్యాస్‌కు డిమాండ్ కనిష్ఠంగా 230 ఎంఎంఎస్‌సిఎండిగా, గరిష్ఠంగా 320 ఎంఎంఎస్‌సిఎండిగా ఉంటుందని నివేదిక పేర్కొంది. డిమాండ్ పెరగడానికి ప్రధానంగా రిఫైనరింగ్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీ (35 ఎంఎంఎస్‌సిఎండి), విద్యుత్ రంగం (5 ఎంఎంఎస్‌సిఎండి), సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (10-12 ఎంఎంసిఎండి)గా ఉండనుంది. విద్యుత్ లోటు లేకుండా చేయాలంటే 310-320 ఎంఎంఎస్‌సిఎండిల గ్యాస్ అవసరం ఉంటుంది. డిమాండ్‌కు తగిన స్థాయిలో ఉత్పత్తి కావాలంటే దేశ నేచురల్ గ్యాస్ పరిశ్రమకు దాదాపు 40-50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం.