Friday, March 26, 2010

ఒబామా సంస్కరణలతో హెల్త్‌కేర్ బిపిఒకు గిరాకీ

బెంగళూరు: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రకటించిన 87,100 కోట్ల డాలర్ల సంస్కరణలతో మన దేశంలోని హెల్త్ కేర్ బిపిఒ, ఐటి సర్వీసుల రంగం వ్యాపారానికి ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు. హెల్త్‌కేర్ రంగంలో బరాక్ ఒబామా పెద్ద ఎత్తున చేపట్టిన సంస్కరణల మూలంగా హెల్త్ కేర్ టెక్నాలజీలో ఔట్‌సోర్సింగ్ భారీగా పెరిగే అవకాశం లేకపోయినప్పటికీ, మన దేశంలో అమెరికా హల్త్‌కేర్ ఇన్సూరెన్స్, క్లెయిమ్ ప్రాసెసింగ్ నిర్వహించే బిపిఒ సంస్థలకు గిరాకీ బాగాపెరుగుతుందని ఐటి రంగం నిపుణులుపేర్కొంటున్నారు.

మన దేశంలో ఉన్న హెల్త్ కేర్ ఐటి సర్వీసులు అందించే వారు ప్రధానంగా సిస్టమ్ ఇంటిగ్రేషన్, అప్లికేషన్ మేనేజ్ మెంట్, మెయింటనెన్స్, లెగసీ మోడర్నైజేషన్ వంటి వాటిపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. అమెరికాలో ఆరోగ్య సంరక్షణ బీమా సదుపాయం పొందే వారి సంఖ్య మరింతగా పెరగనున్నందున ఆ మేరకు ఇన్సూరెన్స్, క్లెయిమ్ ప్రాసెసింగ్ ఐటి సర్వీస్ కాంట్రాక్టులు భారతీయ ఐటి కంపెనీలకు తరలి వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఒబామా ప్రకటించిన సంస్కరణల మూలంగా కొత్తగా 3.2 కోట్ల మందికి ఆరోగ్య బీమా సౌకర్యం లభిస్తుంది. ఇందుకుగాను కొత్త సభ్యుల నమోదు, వారి క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ పనులు ఔట్‌సోర్స్ చేసే అవకాశం ఉంది. మెడికల్ ట్రాన్స్ క్రిప్షన్ రంగంలోనికంపెనీలకు కూడా మంచి వ్యాపార అవకాశాలు లభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.