Saturday, March 27, 2010

2010-11లో మార్కెట్లో మరింత జోరు 30 శాతం వృద్ధికి అవకాశం

మరి కొద్దిరోజుల్లో నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభ కానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2010-11)లో స్టాక్ మార్కెట్ మరింత ముందుకు దూసుకుపోయే అవకాశం ఉందని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల నాల్గవ త్రైమాసిక ఫలితాల వెల్లువ మరో వారం రోజుల్లో ప్రారంభకానున్న నేప«థ్యంలో స్టాక్ మార్కెట్లు మరికొంత పుంజుకున్నాయి.


బిఎస్ఇ సెన్సెక్స్ శుక్రవారంనాడు 86 పాయింట్లు పెరిగి రెండు మాసాల గరిష్ఠ స్థాయిని తాకింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సహా బ్లూచిప్ కంపెనీల కొనుగోళ్లతో సెన్సెక్స్ రెండు నెలల గరిష్ఠ స్థాయి 17,644 వద్ద క్లోజైంది. సెన్సెక్స్ వారంతపు వృద్ధిలో ఇది వరుసగా ఏడో వారం. గత సంవత్సరం జూన్ తరువాత సెన్సెక్స్ వారాల ప్రాతిపదిక ఇంత ఎక్కుకాలం పెరగటం ఇదే మొదటిసారి.

ఇంకా పెరగనుందా!

స్టాక్ మార్కెట్లు ఇప్పటికే నాల్గో తైమాసిక ఆర్థిక ఫలితాలను డిస్కౌంట్ చేశాయని ఎనలిస్టులు అంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ కంపెనీల పనితీరు ఏవిధంగా ఉంటుదన్న అంచనాలపైనా వారు దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల నాల్గవ త్రైమాసిక ఫలితాలకంటే అవి ప్రకటించే భవిష్యత్ రాబడి అంచనాల పట్ల స్టాక్‌మార్కెట్ వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి.

మరింత మెరుగ్గా..
మార్చి మాసాంతంతో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంకన్నా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ రాబడులు మరింత మెరుగ్గా ఉంటాయని మార్కెట్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 శాతం మించి వృద్ది ఉండవచ్చునని భావిస్తున్నారు. 30 కంపెనీల సెన్సెక్స్‌లోని ఒక్కొక్క షేరు విలువ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1,045 రూపాయల మేర ఉండవచ్చునని వారి అంచనా.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 23 శాతం అధికమని ఎడిల్ విజ్ క్యాపిటల్ ప్రెసిడెంట్ నరేశ్ కొఠారీ పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25 నుంచి 30 శాతం పెరిగే అవకాశం ఉందని పోర్ట్‌ఫోలియో మేనేజ్ మెంట్ సర్వీసెస్ కంపెనీ ప్రభుదాస్ లీలాధర్ సిఇఒ సందీప్ సబర్వాల్ పేర్కొన్నారు.

భయపెడుతున్న వడ్డీ రేటు
బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచితే కొన్ని రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని, ఇది స్టాక్ మార్కెట్‌ను కుంగతీస్తుందని మార్కెట్ పండితులు చెపుతున్నారు. ఆర్‌బిఐ వచ్చే నెలాఖరులో జరిపే వార్షిక పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్ల పెరుగుదలకు దోహదపడే నిర్ణయం తీసుకుంటే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు.

'ఇప్పటికే ఆర్‌బిఐ చెప్పాపెట్టకుండా రెపో, రివర్స్ రెపోరేట్లను పెంచింది, వార్షిక పరపతి విధాన సమీక్ష లో కీలక రేట్లను మరికొంత పెంచవచ్చు, ఇదే గనుక జరిగితే వడ్డీరేట్లు పెరుగుతాయి, ఇది కార్పొరేట్ కంపెనీల మార్జిన్లపై ప్రభావం చూపిస్తుంది' అని ఎఫ్ఎ క్యాపిటల్ ఎడ్వైజర్స్ సిఇఒ మల్లినాథ్ మాదినేని పేర్కొంటున్నారు.

అయితే ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున పరిస్థితులు మెరుగు పడవచ్చునన్నది మరికొందరి ఎనలిస్టుల భావన . స్టాక్ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి, వచ్చే 3-4 నెలల్లో స్టాక్ మార్కెట్లు 8-10 శాతం పెరిగే అవకాశం ఉందని బ్రోకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.