Friday, March 26, 2010

ఇక అన్నీ ఎలక్ట్రానిక్‌ రిటర్న్‌లే..

సెంట్రల్‌ ఎక్సైజ్‌, సేవల పన్ను చెల్లింపుదార్లకు కొత్త నిబంధన
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సెంట్రల్‌ ఎక్సైజ్‌ పన్ను, సేవల పన్ను చెల్లింపుదార్లకు వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం కేంద్ర ఎక్సైజ్‌ పన్ను, సేవల పన్ను చెల్లించే వారు, నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి... అంటే వచ్చే నెల 1వ తేదీ నుంచి, రిటర్న్‌లను ఎలక్ట్రానిక్‌ రూపంలోనే దాఖలు చేయాల్సి ఉంటుంది. మాన్యువల్‌ రిటర్న్‌లను అంగీకరించరు. ఈ విషయాన్ని కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ హైదరాబాద్‌ కమిషనర్‌ పి.నాగేశ్వరరావు ఇక్కడ ఒక ప్రకటనలో వెల్లడించారు. పన్ను చెల్లింపులు కూడా ఎలక్ట్రానిక్‌ రూపంలోనే చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీని కోసం ప్రభుత్వం 28 బ్యాంకులను గుర్తించింది. ఈ బ్యాంకుల్లో ఇ-చెల్లింపులు చేయవచ్చు. తదుపరి రిటర్న్‌లను ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి. దీనిపై ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ అధికార్లను సంప్రదించాలని ఆయన సూచించారు. లేదా టోల్‌ఫ్రీ నెంబరు 1800 425 4251 కు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకోవచ్చునని పి.నాగేశ్వరరావు వివరించారు.