Saturday, March 27, 2010

దేశంలో మ్యూచువల్‌ ఫండ్‌..


రూ.8,00,000 కోట్లకు ఆస్తులు
రంగంలో 41 సంస్థలు.. సిద్ధంగా మరో 23
మన మార్కెట్లపై విదేశీ మదుపర్లకు పట్టు ఎక్కువే. వాళ్లు కొంటే మార్కెట్లు దూసుకుపోతాయి. వాళ్లు అమ్మేస్తే కుప్పకూలిపోతాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో మదుపర్లకు నష్టభయాన్ని తగ్గించేవి కచ్చితంగా మ్యూచువల్‌ ఫండ్లే.
దేశంలో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు నానాటికీ తమ పరిధి పెంచుకుంటున్నాయి. అంతేకాదు.. కొత్త సంస్థలూ అరంగేట్రం చేస్తున్నాయి. ప్రస్తుతం 41 సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తూండగా.. మరో 23 సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రస్తుత 41 సంస్థల మొత్తం ఆస్తులు రూ.8,00,000 కోట్ల వరకు ఉండటం గమనార్హం. 22 ఏళ్ల క్రితం వీటి ఆస్తుల విలువ రూ.6,700 కోట్లే. దాంతో పోలిస్తే ఇప్పటి ఆస్తుల విలువ ఏకంగా 116 రెట్లు పెరిగింది. గత రెండు మూడేళ్లలో ఈ పరిశ్రమ మరింతగా విస్తరిస్తోంది. కొత్తగా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్న కంపెనీలు విదేశీ భాగస్వామ్యంతో, వినూత్న వ్యూహాలతో వస్తున్నాయి. పెట్టుబడులపై అత్యధిక రాబడి హామీలు గుప్పిస్తూ.. మదుపర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నాయి.

ఓ పెద్ద మార్పు...: ఫండ్‌ల పరిశ్రమ గత రెండు మూడేళ్ల నుంచి ఫర్వాలేదనిపిస్తున్నా.. ఈ రంగానికి అసలు మేలుమలుపు మాత్రం గత ఆగస్టులోనే వచ్చిందని చెప్పొచ్చు. అదీ ప్రవేశ రుసుము తొలగింపుతో. అంతక్రితం ప్రవేశ రుసుము ఫండ్‌ పరిశ్రమకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే అంశం. సాధారణంగా ఇది 2-3 శాతంగా ఉంటుంది. ఈ ఆదాయాన్ని ఏఎమ్‌సీలు తమ పంపిణీదార్ల(డిస్ట్రిబ్యూటర్లు)తో పంచుకుంటూ ఉండేవాళ్లు. ఆర్థిక రికవరీ మొదలైందన్న సంకేతాలు.. స్టాక్‌ మార్కెట్లు మళ్లీ గాడిలో పడటంతో ఆయా రంగాల్లోని అగ్రశ్రేణి సంస్థలు మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారంలోకి భారీ నిధులతో తరలిరావడం మొదలెట్టాయి. అంతక్రితం ప్రోత్సాహకాలు(ప్రవేశ రుసుము) పోవడంతో వెనుకంజ వేసిన పంపిణీదార్లు ప్రస్తుత నేపథ్యంలో తిరిగి ఫండ్‌ వ్యాపారంలోకి అడుగుపెడుతుండడం శుభసూచకమేనని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. (ఆ సమయంలో దాదాపు డిస్ట్రిబ్యూటర్లందరూ కొంత మంది వినియోగదార్లకు ఫండ్లకు మారుగా యులిప్‌లను ఇవ్వజూపారు కూడా)

ఇవీ 'ఘనా'ంకాలు
సోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) లెక్కల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 41 మ్యూచువల్‌ ఫండ్‌ల ఆస్తుల విలువ రూ.7,81,711.523 కోట్లు. 2008-09 ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు రూ.1,44,068 కోట్ల విలువైన ఈక్విటీలు, రూ. 3,27,744 కోట్ల విలువైన డిబెంచర్లు కొనుగోలు చేశాయి. అలానే రూ.1,37,085 కోట్ల విలువైన ఈక్విటీల విక్రయాలు, రూ.2,45,942 కోట్ల విలువైన డిబెంచర్ల విక్రయాలు జరిపాయి. మొత్తంమీద రూ.88,786 కోట్ల నికర పెట్టుబడులు పెట్టాయి.
పెరుగుతున్న పోటీ
ప్పటికే ఉన్న 41 సంస్థలకు తోడు మరో 23 సంస్థలు వస్తుండడం పరిశ్రమలో పోటీకి దారితీయనుంది. ఇప్పటికే ఆ 23 సంస్థలు సెబీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. వీటిలో భారతీయ కంపెనీలు ఇండియా బుల్స్‌, ఫ్యూచర్‌ ఫైనాన్స్‌, శ్రేయీ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ఫైనాన్స్‌, ఆస్క్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటివి ఉన్నాయి. ఇండియా ఇన్ఫోలైన్‌, ప్రైమ్‌ సెక్యూరిటీస్‌, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌, జేపీ క్యాపిటల్‌ సర్వీసెస్‌ వంటి బ్రోకరేజీ సంస్థలతో పాటు ఐడీబీఐ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ (బెల్జియంకు చెందిన కేబీసీ గ్రూప్‌తో కలిసి), యాక్సిస్‌ బ్యాంక్‌ వంటివీ ఉన్నాయి.
ఎమ్‌ఎఫ్‌లే ఎందుకు
మ్యూచువల్‌ ఫండ్‌ అంటే ధర్మనిధి. మదుపుదార్ల సొమ్మును మూలధన మార్కెట్‌లో వాటాలు, డిబెంచర్లు, ఇతర సెక్యూరిటీల కొనుగోలుకు పెట్టుబడిగా వినియోగిస్తారు. ఈ పెట్టుబడులపై వచ్చిన ఆదాయం, పెరిగిన పెట్టుబడి విలువను మదుపుదార్లకు వారి యూనిట్ల సంఖ్యకు అనుగుణంగా పంచుతారు.

* వృత్తి నిబద్ధత, బహుముఖ పెట్టుబడి, సానుకూల పాలన, తిరిగి చెల్లించే శక్తి, తక్కువ ఖర్చులు, ద్రవ్యత్వం, పారదర్శకత, సరళత, పథకాలను ఎంచుకునే అవకాశం, పన్ను రాయితీలు, చక్కని నియంత్రణ కలిగి ఉండటం వల్ల సామాన్యులను మ్యూచువల్‌ ఫండ్‌లు ఆకర్షిస్తున్నాయి.

పోటీలో యులిప్‌లూ
రో వైపు మ్యూచువల్‌ ఫండ్‌లకు పోటీగా యులిప్‌(యూనిట్‌ లింక్డ్‌ ప్లాన్‌)లు వస్తున్నాయి. తాజాగా రిలయన్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఏడేళ్ల గరిష్ఠ ఎన్‌ఏవీతో 'హైయెస్ట్‌ ఎన్‌ఏవీ ప్లాన్‌'ను తీసుకొచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో ఐటీ రిటర్నులకు సమయం సమీపిస్తుండడంతో ఈ తరహా పథకాలు చాలానే వచ్చాయి.
అనువైనవి ఎంచుకునేందుకు..
ఆర్థిక స్థితి, విపత్తును ఎదుర్కొనే సహనం, రాబడి అంచనాలకు అనుగుణంగా వివిధ పథకాలున్నాయి.
ఓపెన్‌ ఎండెడ్‌: ఈ పథకంలో వాటాలను (యూనిట్లు) ఎప్పుడైనా కంపెనీ నుంచే నేరుగా కొనుగోలు/అమ్మకం చేయవచ్చు.

క్లోజ్డ్‌ ఎండెడ్‌: నియమిత కాలంలో, వాటాలను పరిమితంగా విక్రయిస్తారు. అనంతరం మదుపుదార్లు లేదా బ్రోకరేజీ సంస్థల వద్దే కొనుగోలు చేయాల్సి వస్తుంది.

ఇంటర్వెల్‌ పథకాలు: ఓపెన్‌ ఎండెడ్‌, క్లోజ్డ్‌ ఎండెడ్‌ పథకాల లక్షణాలను మిళితం చేసినవి. వాటాల విక్రయం, తిరిగి కొనుగోళ్లకు పరిమిత కాలంలో అనుమతిస్తారు.

గ్రోత్‌ స్కీమ్‌: భారీ మూలధన లాభాలను ఆర్జించే సామర్థ్యమున్న కంపెనీల వాటాలను కొనుగోలు చేస్తారు.

ఇన్‌కమ్‌ స్కీమ్‌: సంప్రదాయంగా డివిడెండ్‌లను అందించే కంపెనీల వాటాల కొనుగోలుకు పెట్టుబడులు పెడతారు.

బాలన్స్‌డ్‌ స్కీమ్స్‌: పెట్టుబడులకు ప్రమాదం ఏర్పడకుండా చూసేందుకు విభిన్న కంపెనీల వాటాలు, బాండ్లు, విభాగాలు, దేశాల్లో కూడా పెట్టుబడులకు ఉపక్రమించేవి.

మనీ మార్కెట్‌ స్కీమ్స్‌: మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తుల్లో 26% అమెరికాలో ఉంటాయి. తక్కువ రాబడి/నష్ట ప్రమాదాన్ని ఇచ్చే పథకాలివి. ఏ సమయంలో అయినా కొనుగోలు/అమ్మకం చేయవచ్చు.

ట్యాక్స్‌ సేవింగ్‌ స్కీమ్స్‌: ఆదాయపన్ను చట్టంలోని 80సి నిబంధన ప్రకారం పెట్టుబడులపై పన్ను రాయితీ లభిస్తుంది. వేర్వేరు విభాగాలు, పరిశ్రమల్లో పెట్టుబడులు పెడతారు కనుక, కాలపరిమితితోనే నగదుగా మార్చుకోవాల్సి ఉంటుంది.

ఇండెక్స్‌ స్కీమ్స్‌: నిర్దేశిత మార్కెట్‌ సూచీల కదలికలకు అనుగుణంగా రాబడినిచ్చేవి.