Saturday, March 27, 2010

'నివాస సముదాయాల'పై సేవాపన్ను వద్దు

కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ: నివాస సముదాయాల నిర్మాణాలపై సేవాపన్ను విధించాలన్న ప్రతిపాదనను పునఃసమీక్షించాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ కోరుతోంది. ఆర్థికసంక్షోభం ప్రభావం నుంచి గృహ నిర్మాణ రంగం ఇంకా బయటపడలేదని, బడ్జెట్‌లో ప్రతిపాదించిన సేవాపన్ను మరింత కుంగదీస్తుందనే అభిప్రాయాన్ని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి వ్యక్తంచేశారు. స్థిరాస్తి రంగంపై అసోచామ్‌ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు అదనపు భారాలు వేసే స్థితిలో స్థిరాస్తి రంగం లేదని, ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి దృష్టికి త్వరలో తీసుకెళ్తానని జైపాల్‌రెడ్డి చెప్పారు. స్థిరాస్తి రంగంపై సేవాపన్ను విధించేందుకు ఇది సరైన సమయం కాదని అసోచామ్‌ సమావేశంలో డీఎల్‌ఎఫ్‌ ఛైర్మన్‌ కేపీసింగ్‌ పేర్కొన్నారు. బడ్జెట్‌ ప్రతిపాదన అమలైతే, ఇళ్ల ధరలు పెరుగుతాయని ఆయన వివరించారు. 12 నివాసాల కంటే అదనంగా ఉన్న సముదాయాలను పన్ను పరిధిలోకి తేవాలని ప్రతిపాదించిన సంగతి విదితమే.విక్రయ ధరలో 33 శాతంపై పన్ను విధిస్తే, కొనుగోలుదార్లకు యూనిట్‌ ధరపై 3.5% మేర భారం పడుతుందని చెబుతున్నారు.