Thursday, March 25, 2010

ధరలు నిరాశాజనకం

ఆందోళన చెందుతున్న రైతాంగం
లక్ష్యాన్ని మించిన పొగాకు ఉత్పత్తి
వాణిజ్య పంట
గుంటూరు - న్యూస్‌టుడే
పొగాకు ధరల్లో గతేడాది కనిపించిన వృద్ధి ఈసారి కొరవడటం రైతులను నిరాశ పరుస్తోంది. ఇప్పటికే ధరలు ఎక్కువగా ఉన్నాయంటున్న వ్యాపారుల వాదనకే బోర్డు వంత పాడుతోంది. లక్ష్యానికి మించి దిగుబడి రావడమూ కారణమంటున్నారు. రైతుల పోరాటం మేరకు ప్రస్తుత సీజన్‌లో పొగాకు ప్రారంభ ధర కిలో రూ.120గా నిర్ణయించారు. పొగాకు బోర్డు ఈ ఏడాది నిర్ణయించిన ఉత్పత్తి లక్ష్యం 170 మిలియన్‌ కిలోలు. కానీ 220 మిలియన్‌ కిలోల దిగుబడి వస్తుందని బోర్డు, 240 మిలియన్‌ కిలోల వరకు రావచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఈ దఫా అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల తక్కువ గ్రేడు పొగాకు దిగుబడి ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రెజిల్‌లో వాతావరణం అనుకూలించనందున 25 నుంచి 30 మిలియన్‌ కిలోలు దిగుబడి తగ్గవచ్చనేది అంచనా. అందువల్ల దేశీయ పొగాకుకు మార్కెట్‌ ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. కానీ చైనాలో మన పొగాకు ధరలకన్నా సుమారు 20 శాతం తక్కువగా ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది హైగ్రేడు పొగాకు సగటున కిలో రూ. 104 వరకు పలికితే, ప్రస్తుత సీజన్‌లో రూ. 110-134 వరకు లభిస్తోంది. లోగ్రేడు పొగాకు కిలో రూ. 65-81 వరకు పలుకుతోంది.

*ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాల్లో 2005-06 నుంచి పొగాకు సగటు ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది.
*గత మూడేళ్లలో పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కిలోపై సగటు ధర 123శాతం, కర్నాటకలో 128 శాతం పెరుగుదల ఉంది.
*2008-09లో లభించిన సగటు ధరలను పరిశీలిస్తే పొగాకు చరిత్రలోనే ఇదో రికార్డు.
2009-10 సీజన్‌కు సంబంధించి మన రాష్ట్రంలో పొగాకు వేలం కేంద్రాలు కొన్నాళ్ల కిందట ప్రారంభం కాగా కర్నాటకలో వేలం ముగింపు దశకు చేరుకుంటోంది. త్రెషింగ్‌, ప్యాకింగ్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పొగాకు నిల్వకు గోదాముల కొరత ఉందని వ్యాపారులు అంటున్నారు. విదేశీ కొనుగోలుదారులు మన మార్కెట్‌లోకి ఇంకా రాలేదు. ఈ అంశాలన్నీ పొగాకు ధరలను ప్రభావితం చేస్తాయని వివరిస్తున్నారు.