చిన్నప్పుడు బామ్మో, అమ్మమ్మో పావలా ఇస్తే.. ఠక్కున షావుకారు కొట్టుకెళ్లి బఠాణీలు, చెగోడీలు, జంతికలు, శెనగపప్పు ఉండలు, మామిడి తాండ్ర కొనుక్కుని.. జేబులో వేసుకుని ఆరారగా లాగించేసిన రోజులు గుర్తున్నాయి కదూ..! ఇప్పుడూ అదే.. కాకపోతే కాస్త ఛేంజ్.. పిల్లలకు ఓ యాభై రూపాయలు చేతిలో పెడితే.. పక్కనే ఉన్న షాపుకెళ్లి కుర్‌కురే, లేస్, చిప్స్ ప్యాకెట్లు తెచ్చుకుని కరకరా నమిలేస్తున్నారు. రేట్ల సంగతి పక్కనపెడితే.. కాలక్షేపం తిళ్లకు కొదువలేని రోజులివి. ఒక్క పిల్లలనే కాదు.. పెద్దవాళ్లు సైతం ఈ 'ప్యాకింగ్ తిళ్ల'కు బాగా అలవాటు పడిపోయారు. బంధుమిత్రులతో ముచ్చట్లు, ప్రయాణాలు.. ఇలా సందర్భమేదైనా.. వీరికి అక్కరకొస్తున్నాయీ ప్యాకింగ్ తినుబండారాలు.

కుర్‌కురే, లేస్, బింగో, చీటోస్, అంకుల్‌చిప్స్, లెహర్ చిప్స్, పిక్‌నిక్
చీజ్‌బాల్స్, మంచ్ టైమ్, మినీ సమోస, ఆలూ భుజియా
'రెడీ టు ఈట్' ఫుడ్(ఎప్పుడంటే అప్పుడు తినడానికి సిద్ధంగా ఉండే ఆహార పదార్థాలు) ఇప్పుడో పెద్ద పరిశ్రమగా మారిపోయింది. ప్యాకెట్లలో పల్లీలు, వేరుశెనగ అచ్చులు, ఉండలు, బంగాళదుంప చిప్స్, సమోసాలు.. ఇలా అన్ని రకాల పదార్థాలు లభిస్తున్నాయి. దేశం మొత్తం మీద ఈతరహా చిరుతిళ్లు 1000 రకాల్లో లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాపారం 300 కోట్ల డాలర్ల (సుమారు రూ.14,000 కోట్లు)కు చేరింది. ఇందులో బ్రాండెడ్ ఫుడ్ విక్రయాలు ఏటా 20% పెరుగుతున్నాయి. 'తక్కువ పరిమాణంలో, ఆరోగ్యానికి హాని చేయని, ఇంట్లో వండుకునే వాటికి ప్రత్యామ్నాయంగా' లభించే ఇలాంటి తినుబండారాలకు కొంచెం ఖరీదు ఎక్కువైనా కొనేందుకు మధ్య తరగతి, ఉన్నత వర్గాల ప్రజలు ముందుకొస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా వర్గాలను ఆకట్టుకునేలా బ్రాండెడ్ కంపెనీలు నూతన ఉత్పాదనలతో ముందుకొస్తున్నాయి. విదేశీ కంపెనీలు స్థానిక ఉత్పత్తిదారులతో భాగస్వామ్య కంపెనీలను ఏర్పాటు చేసి మరీ మందుకు దూసుకుపోతున్నాయి.
ఎన్ని కంపెనీలో..: హిందుస్థాన్ లీవర్, పార్లే, హల్దీరామ్స్, నెస్లే, బ్రిటానియా, క్యాడ్‌బరీ,ఐటీసీ, కాన్ ఆగ్రా, మారికో, డాబర్, బికానో, ఫ్రిటో లే, కెలాగ్స్, బాలాజీ, నీలగిరీస్ వంటి సంస్థలు ప్యాకెట్ ఫుడ్ తయారీలో నిమగ్నమయ్యాయి. మన రాష్ట్రానికి సంబంధించి ప్రియా ఫుడ్స్, స్వీట్ మ్యాజిక్ సంస్థలు కూడా ఈ మార్కెట్లో ప్రవేశించాయి. అమూల్ బ్రాండ్‌తో ప్రసిద్ధి చెందిన గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) కూడా గత జూన్ నుంచి రంగంలోకి దిగింది. ఇవికాక స్థానికంగా పేరొందిన దుకాణాలు, తయారీ సంస్థలు, ఇళ్లలో తయారు చేసి విక్రయించే వారూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. మార్కెట్లో వీరి విక్రయాలు ఏటా 8% పెరుగుతున్నాయని అంచనా.
డిమాండ్ ఇలా: ప్రాంతాలకు అతీతంగా అత్యధికంగా అమ్ముడయ్యేవి బంగాళాదుంప చిప్స్. కారం, ఉప్పు జతచేసే స్నాక్స్ విక్రయాల్లో 85% ఇవే ఉంటాయి. మిగిలినవి వేరుసెనగ గుళ్లు, పప్పులతో తయారు చేసేవి. రిటైల్ చెయిన్ దుకాణాల్లో పాప్‌కార్న్‌తో పాటు సోయా గింజలు,బ్రెడ్, చాకొలేట్ కలిపిన పదార్థాలు,వేయించిన-ఉడికించిన పద్ధతిలో తయారుచేసేతినుబండారాలకు గిరాకీ అధికంగా లభిస్తోంది.
ప్యాకింగ్ కీలకం: ఆహార తయారీ పరిశ్రమలో ప్యాకింగ్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. స్నాక్స్ తయారీదార్లు బ్యాక్టీరియా నశించేలా నైట్రోజన్ ఫ్లష్ ప్యాకింగ్ చేస్తూంటారు. చిప్స్ వంటి తక్కువ బరువు ఉండే వాటిలో 35-40 గ్రాముల ప్యాకెట్లు ఎక్కువగా విక్రయమవుతాయి. 400 గ్రాముల వరకు ఆయా కంపెనీలు అందుబాటులోకి తెస్తున్నాయి.
ఎగుమతి, దిగుమతులు:ఆరంభంలో విదేశాల నుంచి మన దేశానికి ప్యాకెట్ ఫుడ్ ఎక్కువగా దిగుమతి అయ్యేది. ఇప్పుడు మన దేశం నుంచీ ఎగుమతి చేస్తున్నారు.
* 2002లో రూ.46 కోట్ల విలువైన సరకు దేశంలోకి దిగుమతి కాగా, 2006లో ఈ మొత్తం రూ.138 కోట్లకు చేరింది.
|
* 1999లో పెప్సికో అనుబంధ సంస్థ ఫ్రిటోలే తయారుచేసిన 'కుర్‌కురే'కు అనూహ్యమైన గిరాకీ ఏర్పడింది. భారతీయులను ఇంతగా ఆకట్టుకున్న ఈ ఉత్పాదనను అంతర్జాతీయంగా ప్రవేశపెట్టాలని పెప్సికో సన్నాహాలు చేస్తోంది. భారత్‌లోని కుర్‌కురే ఫ్లేవర్ ఉంటూనే, అంతర్జాతీయతకు అనువైన రుచి ఉండేలా తీర్చిదిద్ది అమెరికా, బ్రిటన్‌లలో ప్రవేశ పెట్టేందుకు పెప్సికో యత్నిస్తోంది. * భారత్‌లో జరిగే ప్యాకెట్ ఫుడ్ విక్రయాల్లో ఫ్రిటోలేకు 45% వాటా ఉంది. * భారత్‌లోని విభిన్న ప్రాంతాల ప్రజల అభిరుచికి అనుగుణంగా ఆయా సంస్థలు తమ ఉత్పాదనల రుచులను స్వల్పంగా మార్చి, స్థానికంగా సరఫరా చేస్తున్నాయి. * 2005లో 155 బిలియన్ డాలర్లు ఉన్న భారత ఆహార పరిశ్రమ, 2025 నాటికి 344 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. * పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి స్నాక్స్ తలసరి వినియోగం 500 గ్రాములు, గ్రామీణ ప్రాంతాల్లో ఇందులో పదోవంతు ఉంటుందని అంచనా. * దేశంలో అత్యధికంగా పశ్చిమ భారతావనిలో స్నాక్స్ వినియోగం అధికం కాగా, తర్వాతి వాటా ఉత్తరాదిదే. |