Wednesday, March 24, 2010

మళీ పిసి మార్కెట్ హవా

న్యూఢిల్లీ: పర్సనల్ కంప్యూటర్ల (పిసి) అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎంటర్‌ప్రైజ్ సెగ్మెంట్ నుంచి డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో 2009-10 సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో పిసి అమ్మకాలు 42 శాతం వృద్ధి చెంది 20 లక్షల యూనిట్లకు పెరిగాయి. ఇందులో నోట్‌బుక్, డెస్క్‌టాప్ కంప్యూటర్లు కూడా ఉన్నాయి. తాజా డిమాండ్‌తో కలిపి మొత్తం 2009-10 సంవత్సరానికి పిసి అమ్మకాలు వార్షికంగా ఏడు శాతం వృద్ధితో 73 లక్షల యూనిట్లను అధిగమించాయని అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మేట్) తన వార్షిక నివేదికలో పేర్కొంది.

కాగా డెస్క్‌టాప్ అమ్మకాలు 27 శాతం పెరిగి 13.5 లక్షల యూనిట్లకు, నోట్‌బుక్స్ విక్రయాలు 6.6 లక్షల యూనిట్లకు పెరిగాయి. అంతర్జాతీయ ఆర్థిక మాంద్య ప్రభావం వీడిపోయిందని, ఐటి హార్డ్‌వేర్ పరిశ్రమ తిరిగి వృద్ధి బాటలో పడిందని మేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ మెహతా తెలిపారు. కాగా 2009 మూడో త్రైమాసికంలో కంప్యూటర్లు, విడి భాగాలు, నెట్‌వర్కింగ్ ప్రాడక్ట్‌లు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే మంచి వృద్ధిని నమోదు చేసుకున్నట్లు ఆయన వివరించారు.

ఆర్థిక మాంద్యం కారణంగా కార్పొరేట్ రంగం ఐటిపై వ్యయాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాయి. గత ఐదు త్రైమాసికాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. అయితే అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో మాత్రం డిమాండ్ ఒక్కసారిగా పుంజుకుంది. టెలికాం, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, ఎస్ఎంఇస్, బిపిఒ,ఐటి రంగాల నుంచి పిసిల వినియోగం బాగా పెరిగిపోయింది. ఇక డెస్క్‌టాప్ కంప్యూటర్లలో బ్రాండెడ్ డెస్క్‌టాప్ కంప్యూటర్ల అమ్మకాలు 65 శాతం వృద్ధి చెందాయి. అంతగా పేరులేని ప్రాంతీయ బ్రాండ్ల అమ్మకాలు 35 శాతం పెరిగాయి. కాగా లేజర్ ప్రింటర్ల వినియోగం 70 శాతం వృద్ధి చెందడం విశేషం. అదే విధంగా యూపిఎస్‌ల మార్కెట్ గత ఏడాది అక్టోబర్ -డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే 28 శాతం వృద్ధి చెంది 5.6 లక్షల యూనిట్లుగా ఉన్నాయి.