Monday, March 29, 2010

సిద్ధమవని కొత్త పారిశ్రామిక విధానం

రూపకల్పనలో తీవ్ర జాప్యం
పారిశ్రామిక వర్గాల్లో అయోమయం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాష్ట్రంతో పాటు దేశ విదేశాల్లోని పారిశ్రామికవర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2010-15 రాష్ట్ర పారిశ్రామిక విధానం రూపకల్పనలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నెలాఖరుకల్లా విధానాన్ని విడుదల చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు ముసాయిదానే సిద్ధం కాలేదు. దీంతో వచ్చే నెల నుంచి చేపట్టే పరిశ్రమలకు ఏ విధానం అమలు అమలవుతుందనే విషయమై పారిశ్రామిక వర్గాల్లో అయోమయం నెలకొంది.

వాగ్దానభంగం:ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న 2005-10 పారిశ్రామిక విధానం గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. వచ్చే నెల మొదటి తేదీ నుంచి అది వర్తించదు. అందులోని రాయితీలు, ప్రోత్సహకాలు ఇవ్వడం కుదరదు. ఈ ఏప్రిల్‌ నుంచి అమలు చేసేందుకు వీలుగా మార్చిలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని ప్రభుత్వం 2009 మార్చిలో ప్రకటించింది. దీనిపై అప్పట్లోనే పరిశ్రమల శాఖ ప్రణాళికను రూపొందించింది. దాని ప్రకారం ఫిబ్రవరిలో ముసాయిదాను రూపొందించి, మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి రోశయ్యకి సమర్పించాలి. ఆయన అనుమతి తెలిపాక దానిని విద్యుత్‌, వాణిజ్యపన్నులు, రెవెన్యూ, నీటిపారుదల, న్యాయశాఖలకు పంపించాలి. అక్కడ ఆమోదం లభించిన వెంటనే మార్చి నెలాఖరుకల్లా నివేదికను విడుదల చేసి, ఆ వెంటనే జీవోను జారీ చేస్తే వెంటనే అమల్లోకి వస్తుంది.

ఇంతలోనే కమిషనర్‌ బదిలీ
ఈ ప్రణాళికను పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి శ్యామ్‌బాబు కమిషనరేటుకు 2009 మార్చిలో పంపించారు. అప్పటి కమిషనర్‌ రమేష్‌కు విధాన రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. ఆయన కొన్ని బృందాలను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు. అధ్యయన నివేదికలు వచ్చాక వాటిని పరిశీలించి ముసాయిదా సిద్ధం చేస్తుండగా, డిసెంబరు మాసంలో ప్రభుత్వం ఆయనకు వైద్య ఆరోగ్యశాఖకు బదిలీ చేసింది. బదిలీ వల్ల పారిశ్రామిక విధానం విడుదలలో జాప్యం జరుగుతుందని పరిశ్రమల ముఖ్యకార్యదర్శి శ్యామ్‌బాబు సీఎం దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదు. ఆయనను అక్కడి నుంచి రిలీవ్‌ చేసి, అనంతరామును కమిషనర్‌గా నియమించింది. దీంతో విధాన రూపకల్పన మళ్లీ మొదటికి వచ్చింది. భారీ పరిశ్రమల శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గత వారం సమావేశం నిర్వహించి పరిశ్రమలు లేని రెవెన్యూ డివిజన్లను గుర్తించి, కొత్త విధానంలో చేర్చాలని సూచించారు. ఈ గణాంకాలు అధికారుల దగ్గర లేకపోవడంతో వాటి సేకరణకు పూనుకున్నారు. ఈ లెక్కన ముసాయిదా తయారీ వచ్చే నెలలో కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు.

పొడిగించే ప్రయత్నాలు లేవు:కొత్త ఐటీ విధాన రూపకల్పనలో జాప్యం జరగడాన్ని పరిగణనలోనికి తీసుకొని ప్రభుత్వం పాత విధానాన్ని మూడు నెలల పాటు అంటే వచ్చే జూన్‌ వరకు పొడిగిస్తూ గత వారం ఉత్తర్వులిచ్చింది. పారిశ్రామిక విధానానికి మరో రెండు రోజుల గడువు మాత్రమే ఉన్నా దాన్ని పొడిగించే ప్రయత్నాలు చేయడం లేదు. రాయితీలు, ప్రోత్సాహకాలపై సందిగ్ధత వల్ల కొత్తగా పరిశ్రమలు స్థాపించే వారు వెనక్కితగ్గే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే మాంద్యం, విద్యుత్‌ కోత తదితర పరిణామాల వల్ల పారిశ్రామికరంగం మందగమనంలో ఉంది. కొత్త విధానం ఉత్సాహం నింపుతుందనే ఆశాభావంతో ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వ జాప్యం ప్రతిబంధకంగా పరిణమించింది. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన విధానాన్ని విడుదల చేయాలనే తపన ప్రభుత్వ వర్గాల్లో కనిపించకపోవడం పారిశ్రామిక వర్గాలను విస్మయపరుస్తోంది.