ప్రైవేటు సంస్థలూ ఇన్‌ఫ్రా బాండ్లు జారీ చేయొచ్చు
ఆర్థిక మంత్రి ప్రణబ్ వెల్లడి
న్యూఢిల్లీ: మౌలిక రంగ అభివృద్ధి కోసం ప్రైవేటు సంస్థలు కూడా పన్ను మినహాయింపు కలిగిన దీర్ఘకాలిక ఇన్‌ఫ్రా బాండ్లను జారీచేసుకొనేందుకు అనుమతించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో మౌలిక రంగ అభివృద్ధికి నిధుల సమీకరణ ప్రధాన అవరోధంగా మారిందని ఆయన అన్నారు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా పన్ను మనహాయింపు కలిగిన దీర్ఘకాలికఇన్‌ఫ్రా బాండ్ల జారీకి అనుమతి ఇవ్వడం వల్ల ఈ సమస్య కొంతతీరనుందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం మౌలిక రంగం అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు పలు ప్రైవేటు సంస్థలు కూడా పాల్గొనేందుకు ఉపకరిస్తుందని ఆయన వివరించారు. మౌలిక ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం బీమా, పింఛను పథకాల నుంచి పూర్తిస్థాయిలో నిధులను సమీకరించడంలో పూర్తిగా విజయం సాధించలేకపోయినట్లుగా ఆయన వివరించారు. పన్ను మినహాయింపులతో కూడిన దీర్ఘకాలిక ఇన్‌ఫ్రా బాండ్లను వీటికి మరో ప్రత్యామ్నాయంగా ఆయన తెలిపారు. మౌలిక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడంలో భాగంగానే ఇటీవలి బడ్జెట్‌లో ప్రణబ్ దీర్ఘకాలిక ఇన్‌ఫ్రాబాండ్లపై పెట్టే పెట్టుబడులపై గరిష్ఠంగా రూ.20,000వరకు పన్ను మినహాయింపు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగంలోని మౌలిక ప్రాజెక్టుల ఆర్థిక సహాయ సంస్థ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీ(ఐఐఎఫ్‌సీఎల్)ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దనున్నట్లు ప్రణబ్ వివరించారు. దీనికితోడు మౌలిక రంగంలో ఎదురయ్యే అవాంతరాల పరిష్కారానికి ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ చావ్లా నేతృత్వంలో ఒక ప్రత్యేక స్టాండింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సామాజిక మౌలిక వసతుల విషయంపై కూడా దృష్టిపెట్టాల్సి ఉందని ప్రణబ్ అన్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఆస్తులు-అప్పుల మధ్య తేడా, రంగాల వారీ కేటాయింపులపై ఉన్న నియంత్రణ తదితర కారణాలతో మౌలికంలోని విద్యుత్తు, టెలికాం, రహదారులు వంటి రంగాలకు నిధుల లభ్యతను పరిమితం చేస్తున్నాయని అన్నారు. బ్యాంకులకు మూలధన సాయం అందించడం వల్ల ఈసమస్య కొంత మేర దూరం కానుందని ఆయన అభిప్రాయపడ్డారు.