
చిన్నచిన్న మార్పులతో ఏటా రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఆదా
పాత బల్బులు, రెగ్యులేటర్లు, సాధారణ మోటర్లు మారిస్తే చాలు
పొదుపు నేర్పాల్సిన ప్రభుత్వమే భారీగా దుబారా
ట్రాన్స్‌కో, జెన్‌కోలదీ అదేదారి
హైదరాబాద్ - న్యూస్‌టుడే

వృథా అవుతున్న విద్యుత్(1200 కోట్ల యూనిట్లు)ను ఉత్పత్తి చేయాలంటే 2000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏడాదంతా పనిచేయాలి. ఇంత కరెంటు వినియోగదారుడి వరకు చేరడానికయ్యే మొత్తం ఖర్చు రూ.18000 కోట్లు. రెండేళ్ల కరెంటు దుబారా ఖర్చును విద్యుత్ పరికరాల ఆధునికీకరణకు పెట్టుబడిగా ఖర్చు పెడితే ఏటా 2 వేల మెగావాట్లకు సమానమైన విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. కరెంటు కోతలు ఉండవు. ఇది ఎవరిళ్లలో వారు పెట్టుకొనే ఖర్చు కాబట్టి ప్రభుత్వం మీద పెద్ద భారం ఉండదు. కానీ, సర్కారే తన సొంత కార్యాలయాల్లో విద్యుత్ పొదుపును పట్టించుకోవడం లేదు. ఇక ప్రజల్లో ఏం చైతన్యం కలిగించగలదు?

* కరెంటు పొదుపు పాటించాలని 2001 ఇంధన పొదుపు చట్టం చెబుతోంది. అమలు బాధ్యత సంప్రదాయేతర ఇంధనవనరుల అభివృద్ధి సంస్థ(నెడ్‌క్యాప్)ది. కానీ అందుకు తగిన సిబ్బంది, ఇంజనీరింగ్ విభాగం ఇక్కడ లేరు.
* ప్రభుత్వ భవనాల్లో కరెంటు వినియోగ సామర్థ్యం పెంచాలని రాష్ట్ర ఇంధన శాఖ 2006లో ఉత్తర్వు(నెం.256) జారీచేసింది. దుబారా పెరిగిందే తప్ప తగ్గలేదు. కనీస చర్యలు లేవు.
* బహుళ అంతస్తుల భవనాల్లో సూర్యరశ్మితో నీళ్లను వేడెక్కించే యంత్రాలు తప్పనిసరి చేశారు. వాటిని ఏర్పాటు చేస్తేనే నిర్మాణాలను అనుమతించాలని పురపాలక శాఖ 2006లో జీవో ఇచ్చింది. అమలు కాలేదు. పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఈ విధానం పూర్తిగా అమలవుతోంది.
చిన్నమార్పు... భారీపొదుపు
ఒక యూనిట్ కరెంటు పొదుపు రెండు యూనిట్ల కరెంటు ఉత్పత్తితో సమానం. కరెంటు పొదుపునకు అనేక మార్గాలున్నా పాటించడానికి మనసు రావడం లేదు. చిన్న చిన్న మార్పులతో ఎంత కరెంటు ఆదా చేయోచ్చో చూడండి

* చౌక్ ఉన్న ట్యూబ్‌లైట్‌ల(55 వాట్) స్థానంలో చౌక్ లేకుండా పనిచేసే కోటిన్నర సన్నటి ట్యూబ్‌లైట్లు బిగిస్తే ఏటా 500 మెగావాట్లు దుబారాను నివారించవచ్చు.
* కొత్తగా ఎల్‌ఈడీ దీపాలు వచ్చాయి. వీటికి ఒక వాట్ కరెంటు సరిపోతుంది. వీటిని బెడ్ ల్యాంప్‌లుగా 50 లక్షల పడక గదుల్లో వాడితే ఏటా 30 కోట్ల యూనిట్ల కరెంటు వినియోగాన్ని తగ్గించవచ్చు.
* సాధారణ జెట్ పంపులు వాడితే రోజుకి 2.25 యూనిట్లు ఖర్చవుతుంది. అదే సబ్ మెర్సిబుల్ పంపుసెట్లకు 1.25 యూనిట్లు సరిపోతుంది. 20 లక్షల పంపుసెట్లు మార్చినా ఏడాదికి 70 కోట్ల యూనిట్లు కరెంటు మిగిలినట్లే.
* చాలా ఇళ్లలో ఫ్యాన్లకు సాధారణ రెగ్యులేటర్‌లు ఉన్నాయి. వాటి స్థానంలో ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లు బిగిస్తే 15 శాతం కరెంటు పొదుపు చేయొచ్చు.
* రాష్ట్ర పారిశ్రామిక రంగంలో 20 శాతం కరెంటు అనవసరంగా ఖర్చు అవుతోందని 'బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ' వెల్లడించింది. ఇది 300 కోట్ల యూనిట్లకు సమానం.
వీళ్లే మనకు పొదుపు నేర్పాల్సినవాళ్లు
విద్యుత్ సౌధ... రాష్ట్రానికి కరెంటు వెలుగులు పంచే ఏపీజెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కోల ప్రధాన కార్యాలయం ఇది. కరెంటు ఎంత విలువైందో నలుగురికీ చెప్పాల్సిన స్థితిలో ఉన్న ఈ సంస్థలే దుబారాలో ముందున్నాయని తాజాగా నిర్వహించిన కరెంటు తనిఖీ (ఎనర్జీ ఆడిట్) నివేదిక తెలియజేస్తోంది. ఏటా 2.51 లక్షల యూనిట్లను ఈ భవనంలో పొదుపు చేయొచ్చని తనిఖీలో తేలింది. దాంతో విద్యుత్ సౌథ కరెంటు బిల్లు రూ.11.48 లక్షలు తగ్గుతుందని అంచనా వేశారు. విద్యుత్ సౌధ మొత్తం వాడకంలో దుబారా వాటా 16.3 శాతం. ఉన్నతాధికారుల కార్యాలయాలున్న రెండు, ఆరో అంతస్తులో తనిఖీ జరపలేదు. అక్కడ దుబారా మరీ ఎక్కువ. విద్యుత్ సౌధలో పురాతన కాలం దీపాలు, ఫ్యాన్లు, పాత పంపుసెట్లు వాడుతున్నట్లు తనిఖీలో వెల్లడి అయ్యింది. వాటన్నిటినీ మారిస్తే కేవలం రూ.25 లక్షలు ఖర్చవుతాయి. కానీ, ఆ పని చేయరు.
దుబారాకు మార్గదర్శనాలయం
సచివాలయం రాష్ట్ర పాలనకు కేంద్రబిందువు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు కొలువుదీరేది ఇక్కడే. విధాన నిర్ణయాలు తీసుకొనేది ఇక్కడే. ఇన్ని పెద్ద తలలు పనిచేసేచోట ఏటా రూ.45 లక్షల విలువైన ఆరున్నర లక్షల యూనిట్ల కరెంటు వృధా అవుతోందని కరెంటు తనిఖీ చెబుతోంది. కార్యాలయాల్లో అవసరం ఉన్నా లేకపోయినా ఏసీలు, ఫ్యాన్లు, దీపాలు ఆన్‌లో ఉంటాయి. ఇక్కడ సీఎఫ్‌ఎల్ వాడితే ఏటా 3 లక్షల యూనిట్లు తగ్గించొచ్చు. పాత ఏసీలు తొలగిస్తే మరో మూడు లక్షల యూనిట్లు ఆదా చేయొచ్చు. అలాంటి ప్రయత్నమే జరగదు.

* ఏడు పురపాలక సంఘాల్లో కరెంటు దుబారాను నివారిస్తే ఏటా రూ.5 కోట్లు ఆదాయ చేయొచ్చు.
* ఆర్‌టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్, ప్రభుత్వ ఉన్నతాధికారుల కార్యాలయాలున్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో కరెంటు దుబారా ఎక్కువగా ఉంది.
* మూడేళ్ల క్రితం నెడ్‌క్యాప్ 4 కోట్ల సీఎఫ్‌ఎల్ దీపాలు రూ.15కే వినియోగదారులకు పంచుతామని ప్రకటించింది. విశాఖ జిల్లాలో 7 లక్షల దీపాలు పంచింది. కరెంటు సంస్థల సహాయ నిరాకరణతో నిలిచిపోయింది. ఈ విషయంలో హర్యానా, కేరళ, మహారాష్ట్రలు ఎంతో ముందున్నాయి.
* రాష్ట్రంలో రెండుకోట్ల మంది సీఎఫ్‌ఎల్ దీపాలు వాడితే 800 మెగావాట్ల డిమాండ్ తగ్గించవచ్చు.