Thursday, March 25, 2010

'డిన్‌' లేకుంటే.. పన్ను పత్రాలు చెల్లవ్‌!

'డిన్‌' లేకుంటే.. పన్ను పత్రాలు చెల్లవ్‌!
ఐటీ చెల్లింపుదారులకు సరికొత్త సంఖ్య
ఇతరత్రా లావాదేవీలకు ఆ సంఖ్యే ఆధారం
అక్టోబరు నాటికి అందుబాటులోకి
2010-11 నుంచే అమలులోకి!
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను సంబంధిత వ్యవహారాల్లో పారదర్శకతను తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో వినూత్న చర్యకు ఉపక్రమించింది. పన్ను చెల్లింపుదారులకు ఇప్పటి వరకూ కేటాయిస్తున్న 'పాన్‌' (పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌), 'టాన్‌' (ట్యాక్స్‌ డిడక్షన్‌ అకౌంట్‌ నంబర్‌) మాదిరే.. 'డిన్‌' (డాక్యుమెంట్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌)ను ప్రవేశపెట్టనుంది. ఈ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. 2010-2011 ఆర్థిక సంవత్సరంలోనే అమలులోకి రావచ్చని తెలుస్తోంది. ఇది అమలులోకి వస్తే... ఆదాయ పన్నుకు సంబంధించి జరిపే ప్రతి లావాదేవీ పత్రంపైనా 'డిన్‌' ఉండాల్సిందే. అలాగే ఆదాయపు పన్ను శాఖ కూడా వివిధ వ్యక్తులకు/సంస్థలకు తాను పంపే నోటీసులు, లేఖలు, ఉత్తర్వుల మీదా 'డిన్‌'ను పేర్కొనటం తప్పని సరి.

'డిన్‌' ఎందుకంటే?: ఆదాయ పన్నుకు సంబంధించి ప్రతియేటా పన్ను మదింపు పత్రాలను సమర్పించటం తెలిసిందే. అధికంగా పన్ను చెల్లించిన వారు దానిని తిరిగి(రీఫండ్‌) పొందేందుకు దరఖాస్తు చేస్తుంటారు. ఇవేకాక ఇన్‌కం ట్యాక్స్‌ విభాగం నుంచి నోటీసులు, ఉత్తర్వులు, లేఖలు అందుతుంటాయి. ఈ వ్యవహారాలన్నింటిని మరింత వేగంగా, సులభంగా నిర్వహించటానికి, ఇతరత్రా సమాచారం తెలుసుకోవటానికి 'డిన్‌' ఎంతో ఉపయోగపడుతుందని అధికారులంటున్నారు.

ఆ సంఖ్య వేయకుంటే..
ఆదాయపు పన్ను విభాగం గాని, పన్ను చెల్లింపుదారులు గాని తాము జరిపే పన్ను సంబంధిత వ్యవహారాల పత్రాలపై 'డిన్‌'ను తప్పని సరిగా పేర్కొనాల్సిందే. అలా చేయకుంటే ఆ పత్రం చెల్లదు. డిన్‌ వినియోగం తప్పనిసరి చేస్తూ ఐటీ చట్టంలో '282బి' అనే సెక్షన్‌ను కొత్తగా చేర్చుతున్నారు.

అక్టోబర్‌ నుంచి అమలు!
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకే కాదు ఆ శాఖ అధికారులకూ 'డిన్‌' కేటాయించేందుకు ఆధునిక సాంకేతిక ఆధారిత యంత్రాంగాన్ని ఇన్‌కం ట్యాక్స్‌ విభాగం సమకూర్చుకుంటోంది. అక్టోబరు కల్లా ఈ పని పూర్తి కావచ్చని భావిస్తున్నారు. 2010-11 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్నులపై 'డిన్‌'ను వేయటం తప్పనిసరి కావచ్చు.