ఆఫ్రికా ఫోన్ రింగైంది ఎట్టకేలకు భారతీ కల నెరవేరింది. రెండేళ్లుగా ఆఫ్రికాలో అడుగుపెట్టాలన్న కంపెనీ ప్రయత్నాలు ఇప్పటికి నెరవేరాయి. అంతక్రితం ఎమ్‌టీఎన్ కొనుగోలు విషయంలో రెండు సార్లు విఫలమైనా..చివరకు జైన్ రూపంలో విజయం సాధించింది.
జై(న్)హో భారతీ!
కువైట్ టెలికాం దిగ్గజంతో ఒప్పందం
విలువ రూ.50,000 కోట్లు
త్వరలో సంతకాలు
మూడోసారి ఫలించిన యత్నం

కువైట్‌కు భారతీ అధికారులు: ఒప్పందంపై సంతకాలు చేస్తే భారతీ తక్షణం జైన్‌కు 8.3 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.38,180 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఈ దిశగా నిధుల సమీకరణకు భారతీ గత ఆదివారమే అడుగులు వేసింది. దేశీయ, అంతర్జాతీయ బ్యాంకుల కన్సార్టియంతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. అయితే జైన్ ప్రకటనపై భారతీ స్పందించకపోయినప్పటికీ కంపెనీకి చెందిన అధికారులు ఒప్పంద వివరాలపై చర్చించడానికి ఇప్పటికే కువైట్‌కు వెళ్లారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఒప్పందం ప్రకారం జైన్‌కు 10.7 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉన్నా.. జైన్‌కున్న 1.7 బిలియన్ డాలర్ల అప్పు కారణంగా 9 బిలియన్ డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది. ఒప్పందంపై సంతకాలు పెట్టిన వెంటనే 8.3 బిలియన్ డాలర్లు చెల్లించి మిగతా 700 మిలియన్ డాలర్లను సంతకాలు పెట్టిన ఏడాదిలోగా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, జైన్‌కు చెందిన సూడాన్, మొరాకో ఆస్తులు ఒప్పందంలో లేవు.
భారతీకి లాభమేనా?
జైన్ ఆఫ్రికా ఆస్తుల్లో ఏడు నష్టాల్లో నడుస్తున్నాయ్. అందులో అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే నైజీరియా యూనిట్ కూడా ఉంది. జైన్ లాభదాయకత కూడా భారతీతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఆఫ్రికాలో టెలికాం వృద్ధికి అవకాశాలు బోలెడు. ఇద్దరు ఆఫ్రికన్లలో ఒకరికి మాత్రమే మొబైల్ ఫోన్ ఉంది. అదీకాక జైన్ ఈ ప్రాంతాల్లో బలంగా విస్తరించి ఉంది. ఏడు దేశాల్లో 50-75 శాతం మార్కెట్ వాటాను; ఆరు దేశాల్లో 25-50 శాతం వాటాను కలిగి ఉంది. భారతీ అనుసరించే చౌక, అవుట్‌సోర్స్‌డ్ మోడల్ కార్యకలాపాలను ఆఫ్రికాలో మొదలుపెడితే త్వరలోనే జైన్ లాభాల్లోకి రావడం అంత కష్టమేమీ కాదు.
సమస్యలివీ
* భారీ రుణ సమీకరణ భారతీ ఆదాయాలపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నష్టాల్లో నడుస్తున్న జైన్ నుంచి లాభాలేమీ ఆశించలేం.
* నైజీరియా మార్కెట్‌పై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
* జైన్ నైజీరియాలో వాటాదారైన(65%) ఎకోనెట్ వైర్‌లెస్ నుంచి జైన్ దావాను ఎదుర్కొంటోంది.
* ఎకోనెట్‌కు తొలి తిరస్కరణ హక్కు ఉండడంతో జైన్ నైజీరియా ఆస్తుల విక్రయాన్ని వ్యతిరేకిస్తోంది.
* ఒప్పందంపై సాధ్యాసాధ్యాలపై చర్చలు ముగిశాయి
* వచ్చే కొద్ది రోజుల్లో ఒప్పందంపై సంతకాలు జరుగుతాయి.
* కొనుగోలుకు కావాల్సిన నిధులన్నిటినీ భారతీ సిద్ధం చేసింది.
నిధులిలా వచ్చాయ్
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు నుంచి 1.3 బి. డాలర్లు; బార్‌క్లేస్ నుంచి 0.9 బి. డాలర్లు; ఎస్‌బీఐ నుంచి 1.5 బిలియన్ డాలర్లు(ఇందులో 1 బిలియన్ డాలర్లను రూపాయల్లో ఇస్తారు). బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఏఎన్‌జడ్, మెరిల్ లించ్, సిటీ బ్యాంకు, జేపీ మోర్గాన్ వంటి ఇతర విదేశీ బ్యాంకులూ ఉన్నాయి.
రెండు కంపెనీలూ కలిస్తే..
* భారతీ-జైన్ ఆదాయం : 13 బిలియన్ డాలర్లు
* ఎబిటా(స్థూల లాభం): 5 బిలియన్ డాలర్లు
* వినియోగదారులు: 16.7 కోట్లు(జైన్ వాటా 4.2 కోట్లు)
* అంతర్జాతీయంగా ఏడో అతిపెద్ద మొబైల్ కంపెనీగా భారతీ అవతరిస్తుంది. (ప్రస్తుతం భారతీ 10; జైన్ 20 స్థానాల్లో ఉన్నాయి). ఆఫ్రికాలో 15 దేశాల్లో కంపెనీ విస్తరించినట్లవుతుంది. ఇప్పటికే కంపెనీభారత్ సహా బంగ్లాదేశ్, శ్రీలంకల్లో విస్తరించి ఉంది.