Friday, March 26, 2010

కారిడార్ వస్తే.. పరిశ్రమలకు రిలీఫ్

అడిగినంత ఇస్తే.. ఒక రోజు కోత తగ్గింపు
విద్యుత్‌సంస్థల యోచన.. నేడు ఎస్ఎల్‌డిసి నిర్ణయం

హైదరాబాద్ (ఆన్‌లైన్): విద్యుత్ దిగుమతికోసం ట్రాన్స్‌కో అడిగినంత పరిమాణంలో కారిడార్ అందుబాటులోకి వస్తే..రాష్ట్రంలోని పరిశ్రమలకు కోతను తగ్గించే అవకాశం ఉంది. ఎక్కువ మొత్తంలో విద్యుత్ సరఫరా చేయడానికి తగినంత కారిడార్‌కు అనుమతి లభిస్తే పరిశ్రమలకు ప్రస్తుతం ఇస్తున్న మూడు రోజుల పవర్ హాలిడేను రెండు రోజులకు తగ్గించాలని అధికారవర్గాలు యోచిస్తున్నాయి. కారిడార్ కేటాయింపుపై..దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్‌డిసి) నిర్ణయం నేడు వెలువడనుంది. 800 మెగావాట్లనుంచి వెయ్యి మెగావాట్లవరకు విద్యుత్‌ను బయటినుంచి కొనుగోలు చేస్తామని, దానికి తగినంత మోతాదులో పవర్ కారిడార్‌ను కేటాయించాలని ట్రాన్స్‌కో కోరింది.

అయితే, దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్రాల డిమాండ్, ఎపి డిమాండ్‌ను పరిశీలించి...ఎవరికి ఎంత కారిడార్‌ను కేటాయించాలన్నది ఎస్ఆర్ఎల్‌డిసి నిర్ణయిస్తుంది. ట్రాన్స్‌కో బుక్ చేసిన (కోరిన) మొత్తంలో 30 శాతం, 70 శాతం మధ్య ఎంతైనా కేటాయించవచ్చని అధికారులు అంటున్నారు. 70 శాతం వరకు కేటాయిస్తే.. ఎక్కువ మొత్తంలో విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి అవకాశం వస్తుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. విద్యుత్ పంపిణీ సంస్థలతో నిమిత్తం లేకుండా ఓపెన్ యాక్సెస్‌లో ఎక్కడినుంచైనా విద్యుత్‌ను కొనుగోలు చేసే అవకాశం పరిశ్రమలకు ఇచ్చినా...సరఫరాకు కారిడార్ సమస్య అడ్డంకి అవుతోంది.

పరిశ్రమలు ఇతర రాష్ట్రాలల్లోని ప్రాజెక్టులు, లేదా ట్రేడర్లనుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసినా..దాన్ని సరఫరా చేసి పరిశ్రమలవద్ద అందివ్వాల్సింది విద్యుత్ సంస్థలే..! ఈ అంశంపై చర్చించిన ఉన్నతాధికారులు..కారిడార్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. ఏప్రిల్ 20న తర్వాత రబీ డిమాండ్ తగ్గనుంది. అప్పటికి జల విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోనుంది. అయినా..డిమాండ్ తగ్గుతుంది కాబట్టి సరఫరాలో ఇప్పుడున్నంత కొరత ఉండదని అధికారులు చెబుతున్నారు.