Tuesday, March 30, 2010

ఇంటర్నెట్‌లో ప్రకటనల వ్యాపారానికి రెక్కలు

రూ.1,100 కోట్లకు పరిశ్రమ
ఈ ఏడాది 50% వృద్ధి అంచనా
భవిష్యత్‌పై మరిన్ని ఆశలు
ముంబయి: భారతీయులు క్రమంగా ఇంటర్నెట్‌కు అలవాటు పడుతూ ఉండడం.. ఆన్‌లైన్‌ వ్యాపార ప్రకటనలకు ఊపిరి పోస్తోంది. రానున్న కొన్నేళ్లలో ఈ విభాగం విజృంభించడం తథ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో 4.9 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులున్నారు. ఈ ఏడాది మొత్తం మీద 50 శాతం వృద్ధితో ఈ ప్రకటనల పరిశ్రమ రూ.1,100 కోట్లకు చేరుకుంటుందని ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ అంచనా వేస్తోంది.

ఇంటర్నెట్టే ఎందుకు: చాలా కంపెనీలు తమ వ్యాపార ప్రకటనలకు ఇంటర్నెట్‌నే ఆశ్రయిస్తున్నాయి. ఎక్కువ మందిని తక్కువ ఖర్చుతోనే ఆకర్షిస్తుండడంతో దీనివైపు మొగ్గుచూపుతున్నారని వారంటున్నారు. ప్రత్యేక లక్ష్యిత వినియోగదారులను ఆకట్టుకోవడానికి సరైన మార్గమని చెబుతున్నారు. బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగం పెరిగేదే కానీ తగ్గదు కాబట్టి వర్తమానం..భవిష్యత్‌ కూడా ఇంటర్నెట్‌ ప్రకటనలకు ఊతం ఇవ్వగలదు. ముఖ్యంగా ఇప్పటి యువతను ఆకట్టుకోవాలంటే ఇంటర్నెట్‌ సరైన మాధ్యమమని కంపెనీలు భావిస్తున్నాయి. అదీ కాక సంప్రదాయ మాధ్యమాలైన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలతో పోలిస్తే ఇంటర్నెట్‌ ప్రకటనలకు వ్యాప్తి ఎక్కువ. అంతర్జాతీయంగా కంపెనీలు తమ ప్రకటనలను గుప్పించేయొచ్చు. తక్కువ ఫీజు ఉండడంతో పాటు పెట్టుబడిపై తగిన ప్రతిఫలం కూడా వస్తుంది. అంతే కాదు వినియోగదారుల స్పందనను తెలుసుకోవడంతో పాటు వారితో దీర్ఘకాలం పాటు అనుబంధాన్ని కొనసాగించే వీలుంటుంది.

విద్య, వాహన రంగాలదే పైచేయి
ఆన్‌లైన్‌ వ్యాపార ప్రకటనల కోసం ఖర్చు చేసే వాటిలో విద్యా సంస్థలు ముందున్నాయి. ఇవి ఈ ఏడాది ఈ విభాగంపై 76 శాతం అధికంగా వెచ్చిస్తున్నాయి. వాహన రంగం సైతం తమ ఈ మాధ్యమ ప్రకటనలపై 46 శాతం ఎక్కువ ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు అంచనాలున్నాయి. కోకకోలా, హెచ్‌యూఎల్‌, పెప్సి, హ్యుందాయ్‌, ఐసీఐసీఐలు సైతం ఎక్కువ మొత్తాన్నే ఇందుకోసం పక్కనబెడుతున్నాయి. ఐపీఎల్‌.. 3జీ ప్రభావం కూడా

అన్ని క్రికెట్‌ మ్యాచ్‌లనూ లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇవ్వడానికి యూట్యూబ్‌ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత హెచ్‌ఎస్‌బీసీ వంటి ప్రధాన ప్రకటనదారులూ రంగంలోకి దిగాయి. మరో పక్క 3జీ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ప్రకటనదారులకు మరో ప్లాట్‌ఫాం దొరికినట్లయింది. ఇవి ప్రకటనల విభాగంలో కొత్త విప్లవానికి దారితీస్తున్నాయి. టీవీ, పర్సనల్‌ కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు వంటివన్నిటిని ఒక దగ్గరకు తీసుకురావడం కూడా కంపెనీలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

ఇదీ సమస్య
అయితే తక్కువ మందికే ఈ ప్రకటనలు చేరుతుండడం ప్రధాన సమస్య. కనెక్టివిటీ కాస్త నెమ్మదిగా ఉండడం కూడా ప్రకటనల దారులను అసంతృప్తిని కలిగించేదే.