Monday, March 29, 2010

సన్న బియ్యానికి రెక్కలు...


లారీలతో ఉప్పుడు బియ్యం తరలింపునకు అనుమతి?
మిల్లర్ల ఒత్తిడికి తలొగ్గుతున్న రాష్ట్ర ప్రభుత్వం
ధరలు పెరిగే ప్రమాదం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
కొద్దికాలంగా ఆకాశంలో విహరించి.. అన్నివర్గాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన సన్నబియ్యం ధరలు.. ఇప్పుడిప్పుడే భూమి మీదకు దిగివస్తున్నాయి. జనం వూపిరి పీల్చుకుంటున్న వేళ.. మళ్లీ ఈ బియ్యం ధరలకు రెక్కలు తొడిగే నిర్ణయానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉప్పుడు బియ్యాన్ని లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం ఈ మేరకు పచ్చజెండా వూపింది. దీనికి ప్రభుత్వం కూడా సై అంటే సన్న బియ్యం రేట్లు భవిష్యత్తులో బాగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఉప్పుడు బియ్యం ముసుగులో సన్నబియ్యమూ సరిహద్దులు దాటిపోతాయన్నది గత అనుభవాలు చెబుతున్న పాఠాలు!

రాష్ట్రంలో అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే 'ఖరీఫ్‌ లెవీ మార్కెటింగ్‌ ఏడాది'లో 37 లక్షల మెట్రిక్‌ టన్నుల పచ్చి బియ్యం, 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు (బాయిల్డ్‌) బియ్యం సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 25 లక్షల మెట్రిక్‌ టన్నుల పచ్చి బియ్యం, 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సేకరించింది. గోదాముల్లో ఖాళీ లేకపోవడంతో లెవీ సేకరణ మందగమనంలో సాగుతోంది. గోదాముల్లో సరకు వేరే ప్రాంతానికి వెళితే ఆ మేరకు కొనుగోలు చేస్తున్నారు.

ఉన్నతాధికారిపై ఒత్తిడి
ఈ నేపథ్యంలో తమ దగ్గర భారీగా ఉప్పుడు బియ్యం నిల్వలు ఉన్నాయని, వీటిని లెవీ కింద ఎఫ్‌సీఐ సరిగా సేకరించడం లేదని మిల్లర్ల లాబీ.. పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారికి తెలిపింది. ఈ నిల్వలను లారీల ద్వారా రవాణా చేసుకుని ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోనివ్వాలని ఒత్తిడి తెచ్చింది. మిల్లర్ల ప్రతిపాదన శుక్రవారం పౌరసరఫరాలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ధరల నియంత్రణపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం ముందుకు వచ్చింది. లారీల ద్వారా ఉప్పుడు బియ్యం తరలింపునకు అనుమతివ్వాలని ముఖ్యమంత్రి రోశయ్యకు సూచించాలని ఈ కమిటీ నిర్ణయించినట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. దీనికి ప్రభుత్వం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదే జరిగితే..: ఈ ఖరీప్‌ పంట కాలంలో సన్న బియ్యం ఉత్పత్తి అధికంగా ఉండటంతో రాష్ట్రంలో నిల్వలు అధికంగా ఉన్నాయి. దీనివల్ల కొద్ది కాలంగా సన్న బియ్యం రేట్లు తగ్గాయి. రెండు మూడు నెలల కిందటి వరకు రాష్ట్రంలో పాత సన్న బియ్యం రేట్లు కిలో రూ.35కు పైగా పెరిగాయి. ఇప్పుడు కొత్త పంట రావడంతో సన్న బియ్యం నిల్వలు మార్కెట్లో అధికంగా ఉన్నాయి. అందువల్ల రేట్లు కూడా తగ్గి, నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం నాణ్యమైన కొత్త సన్న బియ్యం కిలో రూ.22 నుంచి రూ.25కే దొరుకుతోంది. ఈనేపథ్యంలో ఉప్పుడు బియ్యం నిల్వలను లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తే.. ఉప్పుడు బియ్యం ముసుగులో సన్న బియ్యం తరలిపోయే అవకాశం ఉంది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరగడం వల్ల రాష్ట్రంలో ధరలు పెరిగాయని విజిలెన్సు విచారణలో తేలింది.

ఇలా చేస్తే మేలు..: పర్మిట్ల ద్వారా ఉప్పుడు బియ్యాన్ని మిల్లర్లు రైల్వే వ్యాగన్లలో తరలించుకునే అవకాశం ఉంది. రైళ్ల ద్వారా తరలించేటప్పుడు లోడింగ్‌.. అధికారుల సమక్షంలో జరుగుతుంది. గమ్యస్థానం చేరాకే అన్‌లోడింగ్‌ జరుగుతుంది. మధ్యలో సరకును కదిలించడం కుదరదు. లారీల ద్వారా రవాణా చేసేటప్పుడూ అధికారుల సమక్షంలోనే లోడింగ్‌ జరిగినా.. మధ్యలో అనువైన చోట వాహనాన్ని ఆపి, సన్న బియ్యాన్ని ఎక్కించే అవకాశం ఉంది. దీన్ని విజిలెన్స్‌ అధికారులు లోగడ బయటపెట్టారు. మిల్లర్లు మాత్రం.. రైల్వేశాఖ వ్యాగన్లను ఇవ్వడంలేదని సాకు చెబుతున్నారు. కోరినన్ని వ్యాగన్లు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని రైల్వే శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం మొదటి ప్రయత్నంగా మిల్లర్లు కోరినన్ని వ్యాగన్లను ఇప్పిస్తే లారీల ద్వారా బియ్యం తరలించాల్సిన అవసరం ఉండదు.

ఎఫ్‌సీఐ ఇంకా 19లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించాల్సి ఉంది. ప్రభుత్వం రెండో ప్రయత్నంగా.. ఎఫ్‌సీఐ గోదాముల్లో సరకును ఇతర రాష్ట్రాలకు కేంద్రం తరలించేలా చేసి, మిగతా 19 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని లెవీ సేకరించేలా చర్యలు తీసుకుంటే లారీల ద్వారా ఉప్పుడు బియ్యం తరలించే అవకాశమే ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశలో చర్యలు తీసుకోకుండా లారీల ద్వారా తరలింపునకు అనుమతిస్తే రాష్ట్రంలో బియ్యం ధరలకు రెక్కలు రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.