Saturday, March 27, 2010

చిట్‌ఫండ్‌ కంపెనీలకు కిరీటి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: వివిధ పరిశ్రమల కోసం ఈఆర్‌పీ అప్లికేషన్‌లను అభివృద్ధి చేస్తున్న కిరీటి సాఫ్ట్‌టెక్‌, చిట్‌ఫండ్‌ కంపెనీల కోసం వెబ్‌ ఆధారిత ఆధారిత ఈఆర్‌పీ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. చిట్‌ఫండ్‌ పరిశ్రమ కోసం చిట్‌కేర్‌ అనే పేరుతో రూపొందించిన ఈ తరహా ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్‌ ఇదేనని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) శ్రీధర్‌ నర్రా తెలిపారు. వచ్చే రెండు సంవత్సరాల్లో 'చిట్‌కేర్‌'ను దాదాపు 100 చిట్‌ కంపెనీలు వినియోగించగలవని అంచనా వేస్తున్నట్లు వివరించారు. దీని ద్వారా రూ.5 కోట్ల ఆదాయం రాగలదని భావిస్తున్నారు. రిటైల్‌, తయారీ, సరకు నిల్వ, డాక్యుమెంట్‌ మేనేజిమెంట్‌ వంటి వ్యాపార కార్యకలాపాలకు ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్సెస్‌ ప్లానింగ్‌ (ఈఆర్‌పీ) సొల్యూషన్‌లు అందిస్తున్న కిరీటి సాఫ్ట్‌టెక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.10 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తోంది. చిట్‌ చందాదారుడు ఆన్‌లైన్‌లో ఆక్షన్‌ వేయడానికి, వివరాలను తెలుసుకోవడానికి కూడా 'చిట్‌కేర్‌' వీలు కల్పిస్తుంది. ఎస్‌ఎంఎస్‌ ద్వారా చిట్‌ వివరాలను తెలియజేస్తుంది. చిట్‌ ఫండ్‌ పనితీరును అంచనా వేయడానికి వసూళ్ల తీరు (కలెక్షన్‌ ప్యాట్రన్‌), బిడ్‌ పేమెంట్‌ తీరు మొదలైన వాటిని విశ్లేషించి నివేదికలు కూడా తయారు చేస్తుంది.