Monday, March 29, 2010

ఈ ఏడాది మరో 41 అమెరికా బ్యాంకులు దివాళా

న్యూయార్క్‌: విచ్చలవిడి ఆర్ధిక విధా నాల కారణంగా 2008 నుండి వరుసగా అమెరికాలోని అనేక బ్యాంకులు దివాళా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మూడు నెలల కాలానికి తాజా 41 అమెరికా బ్యాంకులు మూత పడ్డాయి. ఒక్క మార్చి నెలలోనే ఇప్పటివరకు 19 బ్యాంకులు కూలిపోవడం విశేషం. గత శుక్రవారం ఏకంగా నాలుగు బ్యాంకులు బోర్డు తిప్పేశాయని అమెరికాలో 8000 బ్యాంకులకు బీమా రక్షణ ఇస్తున్న ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. మెకింటోష్‌, యూనిటీ నేషనల్‌, డెసర్ట్‌ హిల్స్‌, కీ వెస్ట్‌ బ్యాంకుల దివాళా వల్ల ఫెడరల్‌ ఏజెన్సీపై 320 మిలియన్‌ డాలర్ల భారం పడింది. ప్రపంచాన్ని మాంద్యంలోకి నెట్టిన అమెరికా క్రమంగా కోలుకోంటున్న నేపథ్యంలో కూడా బ్యాంకుల పతనం ఆగడం లేదు. నిరుద్యోగ స్థాయి తీవ్రంగా 9 శాతానికి చేరడం, చిన్న, మధ్య స్థాయి లో బ్యాంకుల అవకతవకలు ఆగకపోవడం కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతోంది. జనవరిలో 15, ఫ్రిబవరిలో 7, మార్చిలో 11 బ్యాంకులు టపా కట్టాయి. 2008 సెప్టెం బర్‌లో లేమాన్స్‌ బ్రదర్స్‌ కుప్పకూలిపోవడంతో అమెరికాలో బ్యాంకుల పతనం ప్రారంభమై ఆ సంఖ్య ఇప్పటివరకు 195కు చేరింది. కాగా గత మూడు నెలలలో అమెరికా వృద్ధి రేటు 5.6 శాతంగా ఉంది.