ముకేశ్ అంబానీ... మసాలా దోశె
అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి మసాలా దోశెలంటే మహా ఇష్టం. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఆయన ఏ ఫైవ్‌స్టార్ హోటల్‌లోనే వాటిని ఆరిగిస్తారనుకుంటే పొరపాటే.. ముంబయిలో తమిళ తంబీలు ఎక్కువగా ఉండే మాతుంగ ప్రాంతంలోని చిన్న హోటల్ మైసూర్ కేఫ్‌లో దోశెలు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రం. ఆ హోటల్ నిర్వాహకులను కదిలించామా.. ఇక గౌరవనీయ కస్టమర్ ముకేశ్ గురించి టన్నుల కొద్దీ కబుర్లు చెప్పేస్తారు. అంతే కాదండోయ్.. ముకేశ్‌కు వన్యప్రాణులన్నా ప్రాణం. మనదేశంలోని వన్యప్రాణుల గురించి రెండేళ్ల క్రితం భారీసైజు ఎన్‌సైక్లోపీడియాను కూడా అందించారు. ముంబయిలో రూ.5520 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న తన నివాస సముదాయంలో థియేటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారట.. ఇష్టమైన బాలీవుడ్ సినిమాలను చూడకుండా ముకేశ్ ఉండలేరు మరి! |
అనిల్.. 'రేసు' గుర్రమే అంబానీ సోదరుల్లో చిన్నవాడైన అనిల్ అంబానీకి దేహదారుఢ్యంపై మక్కువ ఎక్కువ. ముంబయి సంపన్న వర్గాల జీవనశైలికి భిన్నంగా అనిల్ రోజూ తెల్లవారు ఝామున నాలుగింటికే లేస్తారు. దినపత్రికలను ఆమూలాగ్రం చదివేసి, మారథాన్ పరుగు సాధనకు వెళ్తారు. అప్పుడప్పుడు తన పిల్లలతో మహాలక్ష్మీ రేస్ కోర్సుకు వెళ్లి, గుర్రపు స్వారీలోనూ ఆహ్లాదంగా గడుపుతారు. |
ప్రకృతి ప్రేమికుడు... ప్రేమ్‌జీ ప్రకృతి ప్రేమికుడైన విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ ట్రెక్కింగ్‌కు వెళ్తూంటారు. పర్యావరణ పరిరక్షణపై అమితాసక్తి కలిగిన ప్రేమ్‌జీ, కాలుష్యాన్ని వెదజల్లని హైబ్రిడ్ కారు కోసం పరిశీలన జరుపుతున్నారు. ఇక సినిమాలంటే ఆయనకు ఎంతో మక్కువ. ఏ సినిమా బాగుందంటూ కొన్ని సందర్భాల్లో తన కంపెనీలోని సహచరులనే అడుగుతూ ఉంటారు. |
సిగ్గరి.. శశి రూయా ఎస్సార్ గ్రూప్ అధినేత శశి రూయాకు ప్రసార మాధ్యమాల్లో కన్పించాలంటే మహాసిగ్గు. ఒకవేళ మొహమాటానికి ఇంటర్వ్యూ ఇచ్చినా.. తన సోదరుడు రవి రూయాతో కలిసి ఉన్న ఫోటోయే వేయాలని కోరుతుంటారు. పాత కథలు చెప్పడంలో శశికి ఎంతో నేర్పు ఉంది. ఛలోక్తులతో కూడిన కథలు చెబుతూ, చుట్టూ బృందాన్ని ఉంచుకునే శశి మంచి ఆహార ప్రియుడు. |
23 అంటే ఇష్టం.. సూక్ష్మ బుద్ధితో, చురుకుగా స్పందిస్తారని పేరున్న భారతీ ఎయిర్‌టెల్ అధినేత సునీల్‌మిట్టల్‌కూ నమ్మకాలు ఎక్కువే. ఏ పెద్ద కార్యక్రమం చేపట్టాలన్నా 23వ తేదీని ఎంచుకుంటారు. ఆయన పుట్టిన తేదీ 23, పెళ్లిరోజు 23.. ఢిల్లీలో ఉన్నప్పుడు తన సోదరులు, సన్నిహితులతో కలిసి భారతీ ప్రధాన కార్యాలయంలో గడుపుతారు. |
పార్టీలకు దూరం.. దిలీప్ సంఘ్వి ఆరోగ్యం కాపాడుకోవడంలో సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి ఎంతో ముందు చూపుతో ఉంటారు. ఉంటే తన కంపెనీలో.. లేదా ఆధ్యాత్మిక చింతనలో ఇంటిలోనే గడుపుతుంటారు. పార్టీలు కాదు కదా.. ఔషధ కంపెనీల సమావేశాల్లో పాల్గొనేది కూడా అరుదే. ఎప్పుడైనా ముంబయి, అంధేరి శివార్లలో కనపడుతుంటారు. పని నుంచి విశ్రాంతి కావాలనుకుంటే కొడైకెనాల్, కేరళలోనిబ్యాక్‌వాటర్స్‌కు వెళ్తూంటారు. |