Monday, March 29, 2010

పన్ను ఎగవేతదారులపై ఐటీశాఖ 'పంచ్‌'నామా!

న్యూఢిల్లీ:పన్ను ఎగవేతలను నివారించేందుకు ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొంటోంది.కంప్యూటర్‌ వంటి ఉపకరణాల ఆధారంగా పన్ను ఎగవేతదారులు వాస్తవ సమాచారాన్ని దాచి ఉంచి ఎక్కువ పన్నును తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తుండడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. దీనికి చెక్‌ చెప్పేందుకు ఐటీ శాఖ చిన్నస్థాయి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు, నిపుణుల సేవలను వినియోగించుకొంటోంది. ఆదాయపు పన్ను సోదాలకు వచ్చేఅధికారులు హార్డ్‌వేర్‌ల ద్వారా ఇలాంటి సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించగానే వాటిలో ఉన్న డాటా మొత్తం తుడిచిపెట్టుకుపోయేలా ఎగవేతదారులు 'లాజిక్‌ బాంబ్‌' వంటి అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నారు. దీనిని నివారించి వాస్తవ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఐటీ శాఖ అధికారులు తమ సోదాల సమయంలో డాటా చెడి పోకుండా ఉండే ప్రీ-వైప్డ్‌ డిస్కుల్ని తమతో తీసుకొనిపోతున్నారు. వీటిద్వారా సర్వర్లు, కంప్యూటర్లలో ఉన్న హార్డ్‌డ్రైవ్‌లలో సమాచారాన్ని నేరుగా ఈ డెస్క్‌ల్లోకి క్లోన్‌, ఇమేజింగ్‌ చేసుకొని పరిశోధనా ల్యాబ్స్‌కు పంపుతున్నారు. వాస్తవాలను తెలుసుకొనేందుకు ల్యాబ్‌లు, నిపుణుల సహాయంతో ఐటీ శాఖ 'పంచనామా' నిర్వహిస్తోంది. మోసాలు వెలుగుచూస్తే పన్ను ఎగవేతదారులపై చర్యలు తీసుకొనేందుకు వీటినే సాక్ష్యాలుగా వాడుకుంటున్నారు. ఇటీవల ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో సుమారు రూ.1000 కోట్ల మోసాలు పంచనామా వల్ల బయటపడ్డాయి