Tuesday, March 30, 2010

నేడు భారతీ-జైన్‌ ఒప్పందం!

ముంబయి: కువైట్‌ టెలికాం దిగ్గజం జైన్‌కు చెందిన ఆఫ్రికా ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన 10.7 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.50,000 కోట్లు) ఒప్పందంపై భారతీ ఎయిర్‌టెల్‌ నేడు సంతకాలు చేయనుందని మీడియా వర్గాల కథనం. ఆమ్‌స్టర్‌డమ్‌లోని జైన్‌ ఆఫ్రికా ప్రధాన కార్యాలయంలో ఈ ఒప్పందంపై మంళవారం(నేడు) సంతకాలు జరుగుతాయని కువైట్‌కు చెందిన అల్‌-వతన్‌ దినపత్రిక సోమవారం నాటి తన కథనంలో పేర్కొంది. దాని ప్రకారం జైన్‌ ఛైర్మన్‌ అసాద్‌ అల్‌-బన్వాన్‌, సీఈఓ నబీల్‌ బిన్‌ సలామా, భారతీ గ్రూపు అధిపతి సునీల్‌ మిట్టల్‌, ఇతర అధికారులు దీనికి హాజరుకానున్నారు. సంతకాలు పూర్తయిన వెంటనే జైన్‌ ఛైర్మన్‌, సీఈఓలు తిరిగి కువైట్‌కు తిరిగి వచ్చి బుధవారం బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయొచ్చని ఆ పత్రిక వివరించింది. జైన్‌ వార్షిక ఫలితాలను బోర్డు ఆమోదించాల్సి ఉంది.