Friday, March 26, 2010

పైసకన్నా చవక

చెన్నై : కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆయిల్ అండ్ గ్యాస్, రిటైల్, డిటిహెచ్, టెలికాం, విద్యుత్ రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న వీడియోకాన్ గ్రూప్ తాజాగా మొబైల్ ఫోన్ సర్వీసుల్లోకి ప్రవేశించింది. చెన్నైలో గురువారం నాడు తన జిఎస్ఎం మొబైల్ ఫోన్ సర్వీసులను లాంఛనంగా ప్రారంభించింది. ఈ మొబైల్ సేవలను వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే మూడేళ్లకాలంలో తాము దేశంలో మూడో అగ్రస్థాయి టెలికాం ఆపరేటర్‌గా ఎదగాలన్న లక్ష్యాన్ని ఏర్పరచుకున్నట్లు వెల్లడించారు. ఇందుకుగాను తాము 14,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు.

100 రోజుల్లో 100 పట్టణాల్లో తమ సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నామని, కాల్ చార్జీలు పైసకన్నా తక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ వంద పట్టణాల్లో హైదరాబాద్, విశాఖపట్నం కూడా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో 10 కోట్ల మంది సబ్ స్క్రైబర్ల సంపాదించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలోని 23 సర్కిళ్లలో టెలికాం సర్వీసులందజేసేందుకుగాను వీడియోకాన్ లైసెన్స్‌లు కలిగి ఉంది. సెప్టెంబర్‌నాటికి దేశ వ్యాప్తంగా సర్వీసులను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 70,000 బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది.

కాగా ఇప్పటికే దేశంలోని చాలా సర్కిళ్లలో 12 టెలికాం కంపెనీలు సర్వీసులను అందజేస్తున్నాయి. తాజాగా వీడియోకాన్ మొబైల్ సర్వీసులతో పోటీ మరింత తీవ్రంకానుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కాల్ చార్జీలు పైసకన్నా తక్కువ ఉంటాయని వీడియోకాన్ చెబుతున్న నేపథ్యంలో టెలికాం కంపెనీల మధ్య మళ్లీ టారిఫ్ వార్ మొదలయ్యే అవకాశాలూ ఉన్నాయంటున్నారు.

3జి పెట్టుబడులపై తరువాత నిర్ణయం
మూడో తరం (3జి) సర్వీసులకు సంబంధించిన లైసెన్స్‌లు పొందిన తరువాత ఆ సర్వీసుల్లోకి ప్రవేశించేందుకు ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలన ్నది నిర్ణయిస్తామని వేణుగోపాల్ ధూత్ తెలిపారు. 3జి లైసెన్స్‌ల కోసం తాము దరఖాస్తు చేసుకున్నామని, లైసెన్స్ పొందుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.