Friday, March 26, 2010

'చోటా భీమ్‌' యానిమేషన్‌ చిత్రం

వచ్చే ఏడాది చివరకు విడుదల
గ్రీన్‌గోల్డ్‌ యానిమేషన్‌ ఎండీ రాజీవ్‌
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కార్టూన్‌ నెట్‌వర్క్‌, పోగో పిల్లల చానెళ్లకు చోటా భీమ్‌, కృష్ణ వంటి యానిమేషన్‌ కంటెంట్‌ను అందిస్తున్న హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌గోల్డ్‌ యానిమేషన్‌ కంపెనీ, యానిమేషన్‌ చిత్ర రంగంలోకి అడుగు పెట్టాలని యోచిస్తోంది. ఇప్పుడు సినిమాకు స్క్రిప్ట్‌ సిద్ధమవుతోందని, వచ్చే ఏడాది చివరి నాటికి విడుదల చేసే వీలుందని గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ చిలకా తెలిపారు. దాదాపు 90 నిమిషాల నిడివితో హిందీ భాషలో దీన్ని నిర్మించనున్నారు. తర్వాత తెలుగు, ఇతర భాషల్లోకి అనువదించనున్నారు. ఇందుకు రూ.2.5 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అన్నారు. హైదరాబాద్‌లో కంపెనీ యానిమేషన్‌ అకాడమీని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవతర్సరానికి కంపెనీ టర్నోవర్‌ దాదాపు రూ.10 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు రాజీవ్‌ చెప్పారు. గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌కు వరంగల్‌, హైదరాబాద్‌లలో రెండు యానిమేషన్‌ స్టూడియోలు ఉండగా.. త్వరలో కోల్‌కతాలో మూడో స్టూడియోను ఏర్పాటు చేయనుంది. సొంత మేధో సంపత్తి హక్కులు కలిగిన కంటెంట్‌ను అభివృద్ధి చేయడానికి నిపుణుల అవసరం చాలా ఉందని రాజీవ్‌ అన్నారు. భవిష్యత్తు గిరాకీని దృష్టిలో పెట్టుకుని రెండో యానిమేషన్‌ అకాడమీని ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటికే వరంగల్‌లో ఒకటి ఉందన్నారు. ఏడాది డిప్లమో కోర్సుకు ఫీజు దాదాపు లక్ష రూపాయలు. దీంతోపాటు స్వల్పకాల కోర్సులను కూడా అందిస్తారు.