Friday, March 26, 2010

రివర్స్‌ లాజిస్టిక్స్‌లో అడాగ్‌ కంపెనీ పెట్టుబడి

ముంబయి: టెక్నాలజీ ఆధారితమైన రివర్స్‌ లాజిస్టిక్స్‌ కంపెనీలో తొలి దఫా వెంచర్‌ పెట్టుబడి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు అనిల్‌ ధీరుభాయ్‌ అంబానీ గ్రూపు (అడాగ్‌)నకు చెందిన రిలయన్స్‌ వెంచర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ గురువారమిక్కడ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంత సొమ్ము పెట్టుబడిగా పెట్టిందీ వెల్లడించలేదు. రిలయన్స్‌ వెంచర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు క్లీనర్‌ పెర్కిన్స్‌ కాఫీల్డ్‌ & బైర్స్‌, షెర్పాలోలు కూడా రివర్స్‌ లాజిస్టిక్స్‌లో సహ పెట్టుబడిదారులుగా ఉన్నాయి. రివర్స్‌ లాజిస్టిక్స్‌ కంపెనీ తన ఖాతాదారు కంపెనీలు బ్యాక్‌వార్డ్‌ సప్లయ్‌- చైన్‌ నెట్‌వర్క్‌ వ్యయాల్ని 25 శాతానికి పైగా తగ్గించుకోవడానికి, అలాగే అసెట్‌ రికవరీని 100 శాతానికి మించి సాధించడానికి, ఉత్పత్తిని 10 శాతానికి పైగా మెరుగుపర్చుకోవడానికి సాయపడుతుంటుంది. సప్లయ్‌- చైన్‌ను కంపెనీలు సమర్థంగా నిర్వహించుకోలేకపోవడం, ప్రభుత్వ నిర్దేశిత ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల (ఇ-వేస్ట్‌) సంబంధిత నియమావళిని అవి అరకొరగా మాత్రమే అనుసరిస్తున్న కారణంగా జీడీపీలో 3 శాతం నష్టం వాటిల్లుతోందన్న అంచనాలు ఉన్నాయి.