Wednesday, March 24, 2010

ఇప్పటికి బండి బాగానే లాగించాం మున్ముందు గడ్డు కాలమే

సుజుకీ ఛైర్మన్‌ ఒసాము సుజుకీ
పది లక్షలవ కారు విడుదల
న్యూఢిల్లీ: ''ప్రస్తుతం ప్రపంచ స్థాయి ఉత్పత్తి సంస్థలన్నీ భారత్‌లో ప్రవేశిస్తున్నాయి.. మేం ఇక్కడ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నాం. ఇవాళ మేం పది లక్షలవ వాహనాన్ని విడుదల చేసే స్థాయిని సాధించి ఉండవచ్చు కానీ, సంవత్సరం తిరిగేసరికల్లా ఇరవై లక్షలవ వాహనాన్ని తయారు చేసే స్థాయిని చేరుకోవడం కోసం కఠినమైన ప్రయాణాన్ని సాగించవలసి ఉంటుంది..'' అని సుజుకీ మోటర్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఒసాము సుజుకీ చెప్పుకొచ్చారు. మంగళవారం హర్యానాలోని మనేసర్‌ ప్లాంటులో ఎరుపు రంగు స్విఫ్ట్‌ కారును విడుదల చేయడం ద్వారా మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ (ఎంఎస్‌ఐ) ఒక ఆర్థిక సంవత్సరంలో పదో లక్షలవ కారును విడుదల చేసిన స్థాయికి ఎదిగింది. దీంతో ఇప్పటికే ఈ ఘనతకు సాధించిన ఇతర కంపెనీల సరసన మారుతీ సుజుకీ చోటును సంపాదించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఒసాము సుజుకీ తమకు భవిష్యత్తులో పోటీ తీవ్రం అయ్యేటట్లు ఉందన్నారు. మనేసర్‌ ప్లాంటులో కె-సిరీస్‌ ఇంజిన్‌ల వార్షికోత్పత్తి సామర్థ్యాన్ని ఇపుడు ఉన్న 3 లక్షల యూనిట్ల నుంచి రానున్న రెండేళ్లలో 5.5 లక్షల యూనిట్లకు పెంపొందించుకోవడానికి ఎంఎస్‌ఐ సుమారు రూ.1,700 కోట్లు పెట్టుబడి పెడుతుందని ఆయన ప్రకటించారు. సామర్థ్య విస్తరణ పథకానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఎంఎస్‌ఐ ఛైర్మన్‌ ఆర్‌.సి.భార్గవ మాట్లాడుతూ 'గురుగావ్‌లో మేం కార్యకలాపాలు ప్రారంభించిన రోజున ఆ ప్రాంతంలో కోతులు తిరుగుతూ ఉండేవి.. ఎక్కడ చూసినా పిచ్చిమొక్కలుండేవి.. ఇందిరా గాంధీ దూరదృష్టి, పట్టుదలతో అనుమాన పక్షుల వాదన తప్పు అని నిరూపణ అయింది. భారత దేశంలో ఉన్న వ్యాపారావకాశాలను నిశితంగా అంచనా వేయగలిగారు ఒసాము సుజుకీ. ఆయన నాయకత్వంలో ఇప్పటి ఎదుగుదల సాధ్యపడింద'న్నారు.