Thursday, March 25, 2010

గురూ.. లాభామెంత...?


పబ్లిక్‌ ఇష్యూలకు దరఖాస్తు
లిస్టింగ్‌ రోజే షేర్ల అమ్మకం
గరిష్ఠ ప్రయోజనమే లక్ష్యం
కంపెనీ మూలాలతో పనిలేదు
ఇదీ ఇప్పటి ఇన్వెస్టరు ధోరణి
చిన్న ఐపీఓల్లో పెట్టుబడి పెట్టు.. లిస్టింగ్‌ రోజున లాభాలు పట్టు.
ఇదీ ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కువ మంది రిటైల్‌ మదుపరులు పాటిస్తున్న సూత్రం. ఒకప్పుడు కంపెనీ మూలాలను చూసి పెట్టుబడులు పెట్టిన మదుపరులు ఇప్పుడు ట్రెండ్‌ మార్చారు. ఇష్యూ ధర ఎంత? లిస్టింగ్‌ రోజున అది ఎంత ప్రీమియంతో నమోదు కావచ్చనే అంశాలనే ఎక్కువగా పరిగణనలోకి తీసుకొని పెట్టుబడులు పెడుతున్నారు. లిస్టింగ్‌రోజునే వాటిని విక్రయిస్తూ లాభాలను ఆర్జించడానికి ప్రయత్నిస్తున్నారు.
టీవల మార్కెట్లోకి వస్తున్న ఐపీఓ/ఎఫ్‌పీఓల పట్ల మదుపరులు స్పందిస్తున్న తీరులో విభిన్నంగా ఉంటోంది. గతంలో పబ్లిక్‌ ఇష్యూల్లో పెట్టుబడులు పెట్టే ముందు మదుపర్లు ఆయా సంస్థ మూలాలతో పాటు దీర్ఘకాలిక/స్వల్ప కాలిక విధానంలో పలు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకునేవారు. అయితే ఇటీవల వీరి ధోరణిలో మార్పు వచ్చింది. మదుపరులు తమ వద్ద ఉన్న డబ్బులకు ఎక్కువ సంఖ్యలో షేర్లు వచ్చే చిన్నచిన్న ఇష్యూలను ఎంచుకొని వాటిలోనే ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు. వీటిని కూడా దీర్ఘకాలం కోసం కాకుండా లిస్టింగ్‌ రోజునే విక్రయించి లాభాలను తీసేసుకుంటున్నారు.

ఎక్కువ ఇష్యూలే కారణం: గత ఏడాది మాంద్యం కారణంగా ఇష్యూలకు రావడానికి వెనకడుగు వేసిన సంస్థలు తాజాగా పరిస్థితులు మారడంతో వరుసగా మార్కెట్లోకి వస్తున్నాయి. దీనికి తోడు తాజాగా మరిన్ని సంస్థలు కూడా ప్రాథమిక మార్కెట్‌ బాట పట్టాయి. దీంతో రిటైల్‌ మదుపరులు చాలామంది గతంలో మాదిరిగా మెరుగైన కంపెనీలను ఎంచుకొని లాభాల కోసం దీర్ఘకాల వ్యూహంతో ఇష్యూలకు దరఖాస్తు చేయడం లేదు. ఎక్కువ ఇష్యూల నుంచి గరిష్ఠ స్థాయిలో లాభాలు పొందేందుకు వారు 'లిస్టింగ్‌ లాభాల' పద్ధతిని అవలంబిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

చిన్న వాటితో పెద్ద లాభాలు: గత రెండు నెలల నుంచి మార్కెట్లోకి వస్తున్న ఇష్యూలను పరిశీలిస్తే రిటైల్‌ మదుపరులు తక్కువ ధర ఉన్న వాటిని ఎంచుకొని వాటిలో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు. ఎన్‌టీపీసీ, ఆర్‌ఈసీ, ఎన్‌ఎండీసీ వంటి భారీ ఇష్యూలకు రిటైల్‌ ఇన్వెస్టర్లు కేటాయింపులో సగాని కన్నా తక్కువ స్థాయిలోనే దరఖాస్తు చేయడమే ఇందుకు నిదర్శనం. రూ.45 కోట్ల నుంచి రూ.700 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో గత రెండు నెలల్లో మార్కెట్లోకి వచ్చిన తొమ్మిది ఇష్యూలకు రిటైల్‌ మదుపరుల నుంచి 4.56 రెట్ల నుంచి 21.69రెట్ల స్పందన రావడం కూడా ఇందుకు మరో నిదర్శనం.

కారణాలు ఇవీ..: మదుపర్లు మెరుగైన లాభాల కోసం చిన్న ఇష్యూలను ఎంచుకోవడం వెనక లిస్టింగ్‌ లాభాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు వివరిస్తున్నాయి. చాలా చిన్న సంస్థల ఇష్యూలు లిస్టింగ్‌ రోజుల్లో మెరుగైన లాభాలను అందించడం కూడామదుపరులు సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోందని వారంటున్నారు. దీంతో చాలా మంది మదుపరులు కంపెనీ మూలాల్ని వదిలి 'సూక్ష్మంలో మోక్షం' వెతుక్కుంటున్నట్లుగా వారు వివరిస్తున్నారు. దీనికి తోడు చిన్నసంస్థలు కూడా మార్కెట్‌ అంచనా కన్నా తక్కువకు ఇష్యూలను ప్రకటించడం కూడా మదుపరులను బాగా ఆకర్షిస్తుందన్నది వారు వాదన. ఇటీవల లిస్టింగ్‌ వచ్చిన దాదాపు ఎక్కువ చిన్న ఇష్యూలు లిస్టింగ్‌ రోజున ప్రీమియంతో నమోదు కావడం కూడా మదుపర్లను ఈదిశగా ఆలోచింప చేస్తోంది. ఇలాంటి ఇష్యూలన్నీ ఒకదాని తరువాత ఒకటి ప్రాథమిక లాభాలను అందిస్తుండడం కూడా మదుపరులను ఊరిస్తోన్న మరో అంశం.