Wednesday, March 24, 2010

గ్రామీణులకు చౌకగా ఇంటర్నెట్‌

చేతులు కలిపిన ఇంటెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌
బెంగళూరు: కోట్ల మంది గ్రామీణులకు సాంకేతిక ఫలాలను చేరువ చేసేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌, అగ్రశ్రేణి సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇంటెల్‌ ఇండియా చేతులు కలిపాయి. రాబోయే నెలల్లో 'మేరీ మంజిల్‌ మేరా పెహలా కదమ్‌' (నా గమ్యం, నా మొదటి అడుగు) నినాదంతో పర్సనల్‌ కంప్యూటర్లు, బ్రాడ్‌బ్యాండ్‌ పరికరాలను చౌకగా అందించే పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు ఇంటెల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ అందించే అన్ని పథకాలకు అనువైన పరికరాలను ఇంటెల్‌ ప్రాసెసర్‌తో సమకూరుస్తామని కంపెనీ తెలిపింది. ఇంటెల్‌ ఆటమ్‌ ప్రాసెసర్‌తో రూపొందించిన నెట్‌బుక్స్‌, నెట్‌టాప్స్‌ కూడా ఉంటాయని స్పష్టంచేసింది. సామాన్యులు తమ మొదటి పర్సనల్‌ కంప్యూటర్‌ను, వైమ్యాక్స్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కూడా పొంది, సాంకేతిక ఫలాలను అనుభవిస్తారని నమ్ముతున్నామని ఇంటెల్‌ దక్షిణాసియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సేల్స్‌ &మార్కెటింగ్‌ గ్రూప్‌) ఆర్‌.శివకుమార్‌ పేర్కొన్నారు. సాంకేతిక వారధితో ప్రజల జీవన విధానంలో మార్పు తెచ్చేందుకు ఇంటెల్‌తో కలిసి పనిచేస్తున్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ (వినియోగదారుల విభాగం) ఆర్‌కే అగర్వాల్‌ చెప్పారు.