Friday, March 26, 2010

8% వడ్డీ గృహరుణాలు ఇంకొన్నాళ్లు ?

8% వడ్డీ గృహరుణాలు ఇంకొన్నాళ్లు ?
ముంబయి: గృహ రుణాలపై 8% వడ్డీ వసూలు చేసే పథకాన్ని భారతీయ స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) నూతన ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించే అవకాశం ఉంది. 2009 ఆగస్టులో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు, 3 నెలలు మాత్రమే అమలు చేయాలని భావించారు. అనంతరం ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. నూతన ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగింపుపై ఇప్పటివరకూ బ్యాంక్‌ పాలకవర్గం నిర్ణయం తీసుకోలేదు. అయితే ఖాతాదార్ల నుంచి ఈ పథకానికి లభిస్తున్న అనూహ్య ఆదరణ, వారిని ఆలోచింప చేస్తోందని సమాచారం. ప్రతినెలా సగటున రూ.2500 కోట్ల మేర ఈ పథకం కిందే గృహ రుణాలను ఎస్‌బీఐ మంజూరు చేస్తోంది. నగదు లభ్యతను దృష్టిలో ఉంచుకుని స్వల్ప మార్పులేమైనా చేసినా, ఇటువంటి పథకాన్ని బ్యాంక్‌ కొనసాగిస్తుందని బ్యాంక్‌ ఉన్నతాధికారి ఒకరు పీటీఐతో చెప్పారు. 'గృహరుణాల మార్కెట్‌లో ఉత్తమమైనదే కాక, అత్యంత ఆదరణ పొందిన పథకం కూడా ఇదే. ఉక్కు, సిమెంటు వంటి ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగి, దేశ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతోంది' అని ఆయన అన్నారు.