Wednesday, March 24, 2010

మౌలికంలో పెట్టుబడులు రెట్టింపు

రూ.41లక్షల కోట్లతో అంచనా
ప్రైవేటుపైనే ఆశలు
12వ పంచవర్ష ప్రణాళిక నివేదికలో వెల్లడి
పదిశాతం వృద్ధిరేటుపై దృష్టి: మన్మోహన్‌
లక్ష్యం తేలిక్కాదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ
మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడుల అంచనాలు రెట్టింపయ్యాయి. పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో (2012-17) రూ.41 లక్షల కోట్లు అవసరమని ప్రణాళికాసంఘం అంచనా వేసింది. పదకొండో ప్రణాళిక సవరణ అంచనాల (రూ.20.5లక్షల కోట్లు)తో పోల్చుకుంటే ఇది దాదాపు రెట్టింపు. ''మౌలిక వసతుల పెట్టుబడి, జీడీపీలో 9.95 శాతం వాటా ఉండాలంటే రూ.40,99,240 కోట్లు అవసరం'' అని ప్రణాళికా సంఘం పేర్కొంది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. 10 శాతం వృద్ధిరేటు సాధించాలంటే ఈ రంగంలో పెట్టుబడులు పెరగాలన్నారు. ప్రైవేటు వాటా పెరిగినప్పుడే ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని ప్రధాని చెప్పారు.

మౌలిక వసతుల్లో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని, ముఖ్యంగా ప్రైవేటు వాటా పెరుగుతోందని ప్రణాళికాసంఘం వెల్లడించింది. పదో ప్రణాళికా కాలంలో మొత్తం పెట్టుబడుల్లో ప్రైవేటు వాటా 25 శాతం కాగా 2012 నాటికి ఈ వాటా 36 శాతం అవుతుందని లెక్కగట్టింది. 'పదకొండో ప్రణాళికా కాలంలో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు' అనే సదస్సును ప్రణాళికాసంఘం మంగళవారం నిర్వహించింది. సదస్సును ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పన్నెండో ప్రణాళిక అంచనాల నివేదికను విడుదల చేశారు. టెలికాం చమురు, సహజవాయువు గొట్టాల ఏర్పాటు, విమానయాన రంగాల్లో ఫలితాలు బాగున్నాయని, పెట్టుబడులు మరింత పెరుగుతాయని, రహదారులు, రైల్వేలు, విద్యుత్‌, నీటిసరఫరా రంగాల్లో తగ్గుతాయని ప్రణాళికాసంఘం అంచనా వేసింది.

క్లిష్టపరిస్థితుల్లోనే ప్రపంచ ఆర్థికవ్యవస్థ
ప్రధాని
భారత ఆర్థిక వృద్ధిరేటు వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి 8.5 శాతానికి పెరుగుతుందని, ఆ తర్వాత ఏడాది 9 శాతానికి చేరుతుందని ప్రధాని మన్మోహన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రణాళికాసంఘం సదస్సులో ఆయన ప్రసంగించారు. పన్నెండో పంచవర్ష ప్రణాళికా కాలంలో వృద్ధిరేటు పది శాతానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ''పేదరిక నిర్మూలనకు, యువతకు ఉపాధి కల్పించడానికి పది శాతం వృద్ధిరేటు సాధించడంపై మనం దృష్టిపెట్టాలి'' అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి విద్యుత్‌ రంగం ఎంతో కీలకమన్నారు. ఈ రంగంలో ఇప్పటివరకు సాధించినదానికంటే మరింత ఎక్కువ సామర్థ్యం సాధించాలన్నారు. అయితే ఉన్నత ఆర్థిక వృద్ధిరేటుకు తిరిగి చేరుకోవడం సవాలేనని ప్రధాని ఆ తర్వాత జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాదిలోనూ క్లిష్టంగానే ఉండే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో 9 శాతం రేటు సాధించడం అంత తేలిక్కాదన్నారు. పదకొండో ప్రణాళిక వృద్ధిరేటు లక్ష్యం 9శాతం కాగా ఈ కాలంలో వార్షిక సగటు వృద్ధిరేటు 8.1శాతంగా ఉంటుందని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ ఆహ్లూవాలియా తన నివేదికలో పేర్కొన్నారు.