Saturday, March 27, 2010

'మౌలిక' జోరు తగ్గింది

ఫిబ్రవరిలో 4.5% వృద్ధికి పరిమితం
పారిశ్రామికోత్పత్తి సూచీపై ప్రభావం..?
న్యూఢిల్లీ: ఆరు కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన పరిశ్రమలు ఫిబ్రవరిలో 4.5 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేయగలిగాయి. జనవరిలో 9.4 శాతం వృద్ధి సాధ్యపడిన విషయం విదితమే. తాజా పరిణామంతో.. ఆశిస్తున్న అధిక వృద్ధి రేటు నిలదొక్కుకొనేదేనా అని ఆర్థిక వేత్తలు అనుమానపడవలసివస్తోంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే మాత్రం ముడి చమురు, పెట్రోలియమ్‌ రిఫైనరీ ఉత్పత్తులు, బొగ్గు, విద్యుత్తు, సిమెంటు, ఫినిష్డ్‌ (కార్బన్‌) స్టీల్‌ అనే ఆరు కీలక రంగాల్లోనూ నిరుడు ఫిబ్రవరిలో నమోదు అయిన 1.9 శాతం వృద్ధితో పోలిస్తే ఈసారి ఫిబ్రవరికి 4.5 శాతం వృద్ధి కనిపిస్తోంది. కానీ, వరుసగా మూడు నెలల పాటు గత నవంబరులో 6%, డిసెంబరులో 6.4%, జనవరిలో 9.4 శాతం వృద్ధిని కనబరచి జోరు మీదున్న ఆరు కీలక రంగ పరిశ్రమల్లో ఫిబ్రవరి వచ్చేసరికి ఆ జోరు తగ్గిపోయింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఆరు రంగాలకు గణనీయ ప్రాతినిధ్యం (వెయిటేజి) ఉంది. అది 26.68 శాతం. ఈ కారణంగా.. డిసెంబరు, జనవరిలలో 16 శాతానికి పైగా ఉన్న ఫ్యాక్టరీల ఉత్పత్తి వేగం ఇకపై కొనసాగగలదా అన్న సందేహం తలెత్తుతోంది. 'మౌలిక రంగం తీరును బట్టి చూస్తే, రానున్న నెలలకు ఐఐపీ 10-11 శాతం స్థాయికి పడిపోతుందేమో' అని క్రిసిల్‌ ప్రధాన ఆర్థిక వేత్త డి.కె.జోషి అన్నారు. ఈ ఏడాది చివరకు (మార్చికి) ఐఐపీ 10 శాతమే ఉండవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆర్థిక నిపుణురాలు జ్యోతీందర్‌ కౌర్‌ అభిప్రాయపడ్డారు.

2009 ఏప్రిల్‌ నుంచి గత నెలాఖరు వరకు చూస్తే ఆరు మౌలిక రంగ పరిశ్రమల్లో 5.3 శాతం వృద్ధి ఉంది. అంతకు ఒక ఏడాది కిందట ఈ వృద్ధి 2.9 శాతం మాత్రమేనని ఒక అధికార ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరిలో విద్యుత్తు ఉత్పాదన 7.3 శాతం మేరకు పెరిగింది. ఒక సంవత్సరం కిందట ఈ వృద్ధి 0.6 శాతానికి పరిమితం అయింది. ముడి చమురు ఉత్పత్తి 4 శాతం ఎగబాకింది. గతేడాది ఫిబ్రవరిలో చమురు ఉత్పత్తి 6.2 శాతం కుదించుకుపోయింది. కాగా బొగ్గు ఉత్పత్తి 6.8 %, సిమెంటు ఉత్పత్తి 5.8%, ఫినిష్డ్‌ (కార్బన్‌) స్టీల్‌ 0.9%, పెట్రోలియమ్‌ రిఫైనరీ ఉత్పత్తులు 0.8 శాతం మేరకు నమోదు అయ్యాయి. 2008 ఫిబ్రవరిలో బొగ్గు ఉత్పత్తి 6%, సిమెంటు ఉత్పత్తి 8.3%, ఫినిష్డ్‌ (కార్బన్‌) స్టీల్‌ 2.4%, పెట్రోలియమ్‌ ఉత్పత్తులు 0.5 శాతం మేరకు ఉన్నాయి.