'బి' గ్రూపు షేర్లపై పెరిగిన మదుపర్ల ఆసక్తి ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతుండడం సర్వసాధారణమేమీ కాదు. ఎప్పుడో కానీ అలా జరగదు. అయితే స్టాక్ మార్కెట్లో ఇటీవలి ట్రేడింగ్‌ను చూస్తే ఇది నిజమనిపించకమానదు. ఎందుకంటే ఎప్పుడూ మధ్య, చిన్న షేర్లపై ఏ విషయంలోనైనా పైచేయి సాధిస్తూ వచ్చిన పెద్ద షేర్లు చిన్నబోయాయి. వీటి ట్రేడింగ్ పరిమాణంతో పోలిస్తే చిన్న షేర్ల ట్రేడింగ్ పరిమాణం ఎక్కువగా కనిపించింది. మదుపర్లు వాటిపైనే ఆసక్తి చూపించారు. ఎందుకిలా?

'ఎ' గ్రూప్‌లో ట్రేడింగ్ పరిమాణం కంటే 'బి' గ్రూపులో ట్రేడింగ్ పరిమాణం ఎక్కువగా కనిపించింది. ఇలా మదుపర్లు ఉన్నట్టుండి చిన్న షేర్లవైపు మొగ్గుచూపడానికి కారణాలున్నాయి. ('ఎ' గ్రూపు షేర్లంటే భారీ మార్కెట్ విలువ గల రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి షేర్లు. ఇక బి గ్రూపు షేర్లంటే మధ్య, చిన్న స్థాయి కంపెనీల షేర్లు.) మొదటి కారణం ఏమిటంటే మదుపర్లకు ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద షేర్లతో పోలిస్తే చిన్న, మధ్య స్థాయి షేర్లు ఓ మోస్తరు చౌక ధరలకే వస్తున్నాయి. ఇక చాలా వరకు ఫండ్ సంస్థలు ఇప్పటికే తమ వద్ద ఉన్న మధ్య విలువ షేర్లను భారీ స్థాయిలో కొంటున్నారు. తద్వారా ఆయా షేర్ల ధరలు దూసుకెళ్లేలా చేసి.. తమ పోర్ట్‌ఫోలియోలోని నికర ఆస్తుల విలువ(ఎన్‌ఏవీ)లను పెంచుకోవాలని భావించారు. ఇది రెండో కారణం.
గత మంగళవారమే చూస్తే బి గ్రూపు టర్నోవరు రూ.2,074 కోట్లుగా నమోదైంది. ఎ గ్రూపుతో పోలిస్తే ఇది రూ.197 కోట్లు ఎక్కువ. గురు(18న), శుక్ర(19న), సోమ(22న)వారాల్లోనూ ఇదే ధోరణి కనిపించింది (పట్టిక చూడండి). ఇది సాధారణంగా కనిపించే ధోరణికి పూర్తి వ్యతిరేకం కావడం గమనార్హం.
ప్రస్తుతం మదుపర్లు చిన్న, మధ్య స్థాయి షేర్లు మంచి విలువకే వస్తున్నాయి. మూలాలు కూడా బావుండడంతో ఎ గ్రూపు కంటే ఎక్కువ లాభాలను ఆర్జించగలవన్న విశ్వాసంతో చిన్న షేర్లవైపు దృష్టి మళ్లించినట్లు తెలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అంతే కాదు మధ్య విలువ షేర్లకు మంచి భవిష్యత్ ఉందని.. వీటిలో కొన్ని త్వరలో బ్లూచిప్ షేర్లుగా మారే అవకాశమూ ఉందని వారు చెబుతున్నారు. ఈ విషయమే మదుపర్లకు అత్యంత ఆకర్షణీయాంశంగా కనిపించిందంటున్నారు.
ప్రస్తుత నెలలో బి గ్రూపులో సగటున రూ.2,052 కోట్ల మేర ట్రేడింగ్ జరుగుతోంది. అంతక్రితం నెలతో పోలిస్తే ఇది 27 శాతం ఎక్కువ. అదేఎ గ్రూపు విషయానికొస్తే సగటున రూ.2,566 కోట్లతో 11 శాతం వృద్ధిని సాధించాయి. కానీ మార్చి 17-23 మధ్య తేదీల్లో ఎ గ్రూపుపై బి గ్రూపు షేర్లు ఆధిపత్యం చెలాయించాయి. ఈ వ్యవధిలో దాదాపు 90 షేర్ల మధ్య విలువ షేర్లు 10% లాభాన్ని కూడగట్టుకోవడం విశేషం.