ఉప్పునీటి చెరువుల్లో పెంపకం
కిలో ధర రూ.200
ఏడాదిలో 4 - 5 కిలోల బరువు
విశాఖపట్నం- న్యూస్‌టుడే

చేప ప్రత్యేకత
కోబియా చేప సముద్రంలో 20-30 కిలోల సైజు పెరుగుతుంది. ముళ్లు ఉండవు. రుచి బాగుంటుంది. 'సీ చికెన్'గా వ్యవహరించే ఈ చేప మన మార్కెట్‌లోనే కిలో రూ.200 పలుకుతోంది. విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. ఆరు నెలల్లో రెండు కిలోలు, సంవత్సరంలో 4-5 కిలోల బరువు పెరుగుతుంది. వాణిజ్యపరంగా ఉప్పునీటి చెరువులు, సీ కేజ్‌ల్లో పెంచవచ్చు. ఈ చేప పిల్లలను ఉత్పత్తి చేసేందుకు మత్స్య పరిశోధన సంస్థలు, ఎంపెడా ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ఎట్టకేలకు కోచి కేంద్రంగా ఉన్న సీఎంఎఫ్‌ఆర్‌ఐ మూడేళ్ల ప్రయోగాలు ఫలించాయి. సంస్థ డైరెక్టర్ జి.సైదారావు నేతృత్వంలో తమిళనాడులోని మండపం వద్ద ఉన్న ప్రాంతీయ కేంద్రంలో ఇటీవలే జత కోబియా చేపల నుంచి 15 లక్షల పిల్లలు ఉత్పత్తి చేశారు.
ఇదీ ప్రయోగం: సముద్రంలో కోబియా చేపల్ని పట్టుకుని ఆడ, మగ చేపల్ని వేరు చేసి విడివిడి కేజ్‌ల్లో ఉంచారు. అండం తయారవడం మొదలయ్యాక 23 కిలోల బరువు, 120 సెం.మీ. పొడవు ఉన్న ఒక ఆడ చేపను, 11 కిలోలు, 13.5 కిలోలు బరువున్న రెండు మగ చేపల్ని తీసుకుని సిమెంట్ ట్యాంక్‌లో ఉంచారు. ఫలదీకరణ పక్రియ పూర్తయి ఈ నెల 13 నుంచి ఆడచేప గుడ్లు పెట్టడం మొదలు పెట్టింది. సుమారు 21 లక్షల గుడ్లు పెట్టింది. వీటిని ఇన్‌క్యుబేషన్‌లో ఉంచి 28-30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొదిగారు. సుమారు 15 లక్షల పిల్లలు వచ్చాయని అంచనా. వీటిని పసిపిల్లల్లా జాగ్రత్తగా పెంచుతున్నారు.
* కోబియా రకం ఆడ చేప గుడ్లు పెట్టడం మొదలుపెట్టాక ఏడాది పాటు ప్రతి 15 రోజులకూ 2 లక్షల గుడ్లు పెడుతుంది.
ప్రైవేటు హేచరీలకు..
ప్రస్తుతం సీఎంఎఫ్‌ఆర్‌ఐ దగ్గర 50 జతల కోబియా చేపలున్నాయి. వీటి నుంచి పిల్లల్ని ఉత్పత్తి చేయడం ప్రైవేటు వ్యక్తులకు కష్టం. తామే లార్వా స్థాయిలో ఉన్న పిల్లల్ని ప్రైవేటు హేచరీలకు ఇస్తామని, వారు కొంచెం పెద్దయ్యాక అమ్ముకోవచ్చునని సైదారావు వివరించారు. తొలి విడతలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల్లో 4 హేచరీలను గుర్తించి, వారికి శిక్షణ ఇస్తామని వెల్లడించారు. కోబియాల్ని సీ కేజ్‌ల్లో పెంచితే 5-10 కిలోల సైజుకీ పెరుగుతాయని వివరించారు.