Tuesday, March 30, 2010

2013 నాటికి రూ.5,520 కోట్లకు!

భారత బీపీఓ మార్కెట్‌పై గార్ట్‌నర్‌ అంచనా
బెంగళూరు: భారత వ్యాపార పొరుగుసేవల (బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌- బీపీఓ) మార్కెట్‌ విలువ 2013లో 19 శాతం మేర ఎదగవచ్చని ప్రముఖ ఐటీ రంగ పరిశోధన, సలహా సంస్థ గార్ట్‌నర్‌ అంచనా వేసింది. భారత బీపీఓ మార్కెట్‌ వచ్చే సంవత్సరానికల్లా 1.2 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.5,520 కోట్లకు), ఆ పై ఏడాదికి 1.8 బి. డాలర్లకు (దాదాపు రూ.8,280 కోట్లకు) చేరవచ్చని గార్ట్‌నర్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా ధరలు, కాంట్రాక్టుల రాశి పరంగా ఒత్తిళ్లు ఎదురైనా 2009 లో భారత బీపీఓ మార్కెట్‌ 7.3 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిన విషయం విదితమే. జనాభాపరమైన మార్పులు, ఖర్చు పెట్టే స్థాయిలు, వినియోగ విలువ ఆధారిత సేవలు, నాణ్యతకు పెరుగుతున్న ప్రాధాన్యం, విలీనాలు- కొనుగోళ్ల ధోరణి కొనసాగడం వంటి అంశాల్లో స్వల్పకాలంలో ఈ రంగాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని సంస్థ రిసెర్చి డైరెక్టర్‌ టి.జె.సింగ్‌ అంటున్నారు. గత రెండేళ్లుగా పలు ప్రముఖ భారతీయ బీపీఓ కంపెనీలతో పాటు, అంతర్జాతీయ ఆఫ్‌-షోర్‌ మార్కెట్‌పైనే దృష్టి సారించిన కొన్ని బహుళ జాతీయ సంస్థలు కూడా తమ శ్రద్ధను భారత మార్కెట్‌పైకి మళ్లించి ఇక్కడ పెట్టుబడులు పెంచుతూవచ్చాయని, అంతర్జాతీయ సంక్షోభం ఈ ధోరణిని మరింత బలపరిచిందని ఆయన వివరించారు.