Wednesday, March 24, 2010

రాయితీలపై కఠిన నిర్ణయం!

పెట్రో ధరలు పెంచాలి
రైల్వే విస్తరణకు బడ్జెట్‌ కేటాయింపులొద్దు
బొగ్గుగనులు ప్రైవేటుకు ఎంటీఏ సూచనలు
పథకాల్లో లోపాలు వాస్తవమే: మన్మోహన్‌
న్యూఢిల్లీ: రాయితీల విషయంలో కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పదకొండో పంచవర్ష ప్రణాళిక మధ్యంతర సమీక్ష (ఎంటీఏ) స్పష్టం చేసింది. రాయితీపై ఇచ్చే ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచాలని సూచించింది. రాజకీయాలకతీతంగా రైలు ఛార్జీలను నిర్ణయించడానికి రైల్‌ టారిఫ్‌ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలంది. మంగళవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అధ్యక్షతన ప్రణాళికాసంఘం పూర్తిస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ ఆహ్లూవాలియా పాల్గొన్నారు. ఎంటీఏ చేసిన సూచనలకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. ''వివిధ పథకాల అమల్లోని లోపాలను ఎంటీఏ వెల్లడించింది. వీటిని నివారించాలి. పథకాలను మరింత విస్తరించడానికి అవసరమైన వనరుల కోసం డిమాండ్‌ చేసేబదులు వాటిని ఇంకా మెరుగ్గా అమలు చేయడంపై దృష్టిసారించాలి'' అని మన్మోహన్‌ అన్నారు. ఎంటీఏ సిఫార్సులివీ..

*కేవలం బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా రైల్వేల విస్తరణ, నవీకరణ సాధ్యంకాదు. టారిఫ్‌లను సవరించడం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ప్రాజెక్టులతో అంతర్గత వనరులు సృష్టించుకోవడం ద్వారానే ఇది సాధ్యం.
*రాయితీలు 2009-10 బడ్జెట్‌ అంచనాల స్థాయిని మించకుండా ఉండడంపైనే విజయం ఆధారపడి ఉంది. ఆహారం, ఎరువులు, పెట్రోలియం రాయితీలను బడ్జెట్‌ అంచనాల స్థాయిలోనే ఉంచాలంటే.. ధరల్ని పెంచాల్సిందే.
*ప్రస్తుతమున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరల నిర్ణాయక విధానంఆచరణాత్మకంగా లేదు. పారిఖ్‌ కమిటీ సూచించినట్లు పెట్రో ధరల విధానంపై నియంత్రణ ఎత్తేయాలి.
*ప్రైవేటు మార్కెట్లను అనుమతించేలా, మార్కెట్‌ సంబంధ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడుల్ని ప్రోత్సహించేలా అన్ని రాష్ట్రాలు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీ (ఏపీఎంసీ) చట్టాన్ని సవరించాలి.
*ప్రాజెక్టులకు అవసరమైన పర్యావరణ, అటవీ అనుమతులు సాధించడానికిఫాస్ట్‌ట్రాక్‌ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
*మిగిలిన 5 అల్ట్రా మెగా విద్యుత్‌ ప్రాజెక్టులను త్వరగా ఏర్పాటు చేయాలి.
*బొగ్గుగనులను ప్రైవేటు రంగానికి అందుబాటులోకి తీసుకురావాలి
*జాతీయరహదారుల సంస్థను పునర్‌వ్యవస్థీకరించాలి. ఏటా 7వేల కి.మీ రహదారులను బీఓటీ పద్ధతిలో కేటాయించాలి. అన్ని జాతీయ రహదారులను కనీసం రెండు వరుసల ప్రమాణాల పరిధిలోకి తీసుకురావాలి.
*ప్రధాన ఓడరేవుల సామర్థ్యాన్ని పెంచాలి. 2010-11లో కనీసం 21 బెర్తులను మంజూరు చేయాలి.
*మెట్రో విమానాశ్రయాలుమినహా మిగిలిన విమానాశ్రయాల్లో, రవాణాకు సంబంధించిన పనుల్లో కాకుండా మిగిలిన పనుల నిర్వహణకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిని అవలంబించాలి.