Saturday, March 27, 2010

భారతీయులే పోషకులు

భారతీయులు భోజనప్రియులు. సంతృప్తిగా ఆరగించటంలో ఆరితేరినవారు. సాటిలేనివారు. ప్రదేశాన్ని బట్టి ఇక్కడి వంటకాల్లో విశిష్టత కనపడుతున్నది. ఇక్కడ లభించే పదార్ధాల్లోనూ....రుచుల్లోనూ అనేక తేడాలున్నాయి. ఒకరు నూనెతో వంటలు వండితే...మరొకరు కొబ్బరినూనెతో వాటిని తయారుచేస్తారు. పులుపు, కారం, మసాల వంటకాలను తెగ ఇష్టపడే ఇండియన్స్‌ ...తీపి,వేపుడు పదార్థాలను తినటం కోసం తెగ ఖర్చుపెడుతున్నారు. శీతలపానీయాలను తీసుకోవటంలోనూ ఇతరదేశాలను మించిపోయారు. ఆరోగ్యవిషయాలను పక్కన పెట్టి మరీ వీటి కోసం అర్రులుచాస్తున్నారు. దేశీఉత్పత్తుల కన్నా విదేశీ వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపే భారతీయులు తినటంలోనూ అదే బాటలో పయనిస్తున్నారు.

ప్రపంచంలో ఎవరైనా,ఎప్పుడైనా, ఎక్కడైనా ..ఏదైనా కొత్త వెరైటీ వంటకాన్ని కనిపెట్టారంటే...దాన్ని రుచి చూడనిదే వదలిపెట్టడు భారతీయుడు. హోటల్‌బిజినెస్‌ రంగంలోనూ అనేకదేశాల్లో భారతీయవంటకాలు భోజనప్రియులను ఆకట్టుకుంటాయి. వావ్‌ అనిపిస్తాయి. మరోసారి రుచిచూడాలనిపించేలా ఉంటున్నాయి. సై్పసీగా వండటంలో ఇండియన్‌ కుకింగ్‌ మాస్టర్స్‌ ఆరితేయారు. అయితే దేశంలో స్వదేశీ దుకాణాలకన్నా విదేశీ దుకాణాలు కోకొల్లలు. అంతేకాదు వాటి మార్కెటూ ఎక్కువే.

విదేశీ కంపెనీ అయిన మెక్‌డొనాల్డ్‌ స్థాపించిన దుకాణాలు మార్కెట్‌లో హాట్‌ఫెవరెట్‌. అందులో దొరికే మసాలా ఐటమ్స్‌ని శుష్టుగా లాగించేసిది ఎక్కువగా మనవాళ్లే. కొత్తగా అవి స్థాపించిన ఆలూటిక్కా బర్గర్‌ల సెల్స్‌ ఇక్కడి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక మిచిగాన్‌కు చెందిన డొమినో పిజ్జా సెల్స్‌ అధికమవుతున్నది మనదేశంలోనే. భారతీయులు తినేటప్పుడు అవి ఎక్కడ తయారవుతున్నాయో చూడరు. రుచి అదిరితే చాలు. పదార్థంలో మసాలా ఉంటే మరీ ఇష్టం. షాపులో ఉండే పదార్థం మీద మనసుపడితే అంతే దాన్ని హంఫట్‌ చేయనిదే ఊరుకోరు. అందులో ఉండే విటమిన్స్‌, దాని వల్ల కలిగే లాభం గురించి అసలు ఆలోచించరు.

అది తిన్నామా...లేదా అనే దాని గురించే మనవాళ్లు ఆలోచిస్తారని ఆరోగ్యనిపుణులు చెపుతున్నారు. అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోనే తినే పదార్ధాలను తయారుచేస్తున్నాయి. అందుకే వాటికి డిమాండ్‌తో పాటూ రేటు ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ డ్రింక్‌, క్రీడాకారులు తాగే జ్యూస్‌, నీంబూ పానీ ఇలాంటివే. పార్లే ఆగ్రోకి చెందిన మ్యాంగో ఫ్రూటీ , ఆపీజ్యూస్‌లతో పాటూ గతేడాది ఈ సంస్థ నుంచి వచ్చిన స్నాక్‌ హిప్పో మార్కెట్‌లో బాగానే అమ్ముడవుతోంది.గోధుమతో చేసిన ఈ ఉత్పత్తిలో పోషకవిలువలు అమోఘం అంటోంది ఆ కంపెనీ. పార్లె ప్రొడక్ట్స్‌ సగం ఆదాయం వచ్చేది ఫ్రూటీ నుంచే. అయితే ఈ పానీయాలను మార్కెటింగ్‌ చేయటానికి వాటి కంపెనీలు 100 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నాయి.

మార్కెట్‌లో వాటి స్థానాన్ని పెంచటానికి క్రీడాకారులు, సెలబ్రటీలతో ప్రచారాన్ని నిర్వహిస్తోన్నాయి. పెప్సీ, మౌంటేన్‌ డ్యూ, సెవన్‌ అప్‌, మిరిండా ఇవన్నీ ఈ కోవలోవే. ఉత్పత్తులను ఆకట్టుకోవడం కోసం.. వాటి సేల్స్‌ని పెంచుకోవడం కోసం ఇలా ప్రచారాన్ని నిర్వహించే ఉత్పత్తిదారులు...నాణ్యత, ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదని ఆరోగ్యనిపుణులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సమాజారోగ్యం గురించి పట్టించుకునే మార్కెటర్స్‌ మన దేశంలో అరుదుగానే కనిపిస్తారు. వినియోగదారుడు పోషకవిలువలు కలిగిన ఆహారాన్ని కావాలని కోరుకుంటాడు. కానీ వాటిని అందించేవారే ఇక్కడ కరవు.

ఫుడ్‌ప్యాక్‌ మీద ప్రతి కంపెనీ వారి ఉత్పత్తుల కేలరీల ( ఆహారం ఉత్పత్తి చేసే శక్తిని కొలిచే ప్రమాణం) స్థాయిని ఖచ్చితంగా ముద్రించాలి. అయితే కొన్ని వ్యాపారసంస్థలు వాటిని బేఖాతారు చేస్తున్నాయి. ఇప్పటికీ ఎంతోమంది భారతీయులకి రోజుకి శరీరానికి కావల్సిన కేలరీల శాతం తెలియదు. వాటిని తెలుసుకోవాలన్నా ఆసక్తి వారికి లేదు. గ్రామీణ ప్రజలైతే.. వాటి గురించి అసలు ఆలోచించరు. ఇండియాలో చాలా కంపెనీలు కేలరీ ముద్రణను తమ ఉత్పత్తుల మీద చూపించటం లేదు. కొన్ని పదార్థాల మీద ఆ కంపెనీ పేరు, అవి ఎక్కడ తయారవుతున్నాయో కూడా తెలియదు. చట్టపరంగా చూస్తే ఇలాంటి వాటిని అమ్మకూడదు. కొనకూడదు.

విదేశీ వస్తువులుగా, పదార్థాలుగా చలామణీ అవతున్నవన్నీ తయారయ్యేవి చాలా వరకు మనదేశంలోనే. వాటి రేటుని నిర్థారించేది మాత్రం అక్కడి ఉత్పత్తిదారులు. కొన్ని సంస్థలు నియమనిబంధనలు ఉల్లఘించి మరీ తమ ఉత్పత్తుల సేల్స్‌ని పెంచుకోవటానికి ఆరాటపడుతున్నాయి. దీని వెనక బడా నాయకుల అండదండలు ఫుష్కలంగా ఉంటున్నాయి.పర్యావరణానికి ముప్పు కలిగించే ఎన్నో కంపెనీలపై విదేశాల్లో అక్కడి ప్రభుత్వాలు కఠిన నిషేదాలు విధిస్తున్నాయి. అక్కడి నియమనిబంధనలతో చూసుకుంటే భారత్‌లో అవి బేఖాతరే. అయితే ఇటీవలే కేరళలో ఓ నిపుణుల కమిటీ తీసుకున్న నిర్ణయం అక్కడి ప్రభుత్వాన్ని కదిలించింది. ఓ కంపెనీ మీద కొరడా జులుపించింది.

పర్యావరణానికి హాని కలిగిస్తూ... వ్యాపార కార్యకలాపాలను సాగించిన కోకాకోలా కంపెనీ నుంచి 216 కోట్ల రుపాయలను నష్టపరిహారాన్ని పొందేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ అక్కడి ప్రభుత్వాన్ని సూచించింది. వ్యవసాయం, జలవనరులను కలుషితం చేయడమే కాకుండా...కూలీ, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసేందుకు కారణమయిన ఆ కంపెనీ .....భూగర్భజలాలను విపరీతంగా వాడుకున్నదని, దీని మూలంగా దేశ జలవనరుకి నష్టం వాటిల్లుతున్నదని ఆ కమిటీ పేర్కొంది.దీని వల్ల సామాజిక, ఆర్థిక నష్టం కూడా వాటిల్లిందని తెలిపింది. మురిపించే మార్కెటింగ్‌కి భారతీయులు ఫ్లాట్‌ అవుతున్నారు. దేశీ ఉత్పత్తులతో పోలిస్తే ...విదేశీ పదార్థాల్లో నాణ్యత ఉన్న మాట వాస్తవమే అయినా... వాటి వల్ల మధ్యతరగతికి చెందిన కొన్ని లక్షల కుటుంబాలు వీధిపడుతున్నాయి. నిరుద్యోగంతో అల్లాడుతున్నాయి.